సర్దార్‌ పటేల్‌ మరికొంత కాలం బతికుంటే.. గోవా విమోచన ముందే జరిగేది

20 Dec, 2021 04:59 IST|Sakshi
కార్యక్రమంలో పాల్గొన్న సమరయోధురాలి ఆశీర్వాదం తీసుకుంటున్న ప్రధాని మోదీ

గోవా 60వ విమోచన దినోత్సవంలో ప్రధాని మోదీ

పనాజి: సర్దార్‌ వల్లబ్‌భాయ్‌ పటేల్‌ మరికొంత కాలం బతికుంటే పోర్చుగీసు పాలన నుంచి గోవా విమోచన ముందే జరిగేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మనకు 1947 స్వాతంత్య్రం వచ్చినప్పటికీ గోవా చాలాకాలం పోర్చుగీసు పాలనలోనే ఉండిపోయింది. భారత సైన్యం ‘ఆపరేషన్‌ విజయ్‌’ను చేపట్టి 1961 డిసెంబరు 19న గోవాకు వలసపాలన నుంచి విముక్తి కల్పించింది. గోవా భారత్‌లో భాగమైంది.

ఆదివారం 60వ గోవా విమోచన దినోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన మోదీ మాట్లాడుతూ... సర్దార్‌ పటేల్‌ గనక మరికొన్ని రోజులు బతికి ఉంటే  గోవా ప్రజలు 1961 కంటే చాలాముందుగానే స్వేచ్ఛావాయువులు పీల్చేవారని అన్నారు. జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వంలో ఉప ప్రధానిగా, హోంమంత్రిగా పనిచేసిన పటేల్‌ 1950 డిసెంబరు 15న తుదిశ్వాస విడిచారు. నిజాం పాలనలోని ప్రస్తుత తెలంగాణ, మరఠ్వాడా, కల్యాణ కర్ణాటక (ఐదు జిల్లాలు)తో సహా దేశంలోని పలు సంస్థానాలను భారత్‌లో విలీనం చేసి పటేల్‌ ఉక్కుమనిషిగా పేరొందారు.

గోవా విమోచన ఆలస్యం కావడానికి నెహ్రూయే కారణమని గతంలో పలువురు బీజేపీ అన్నారు. గోవా విమోచన కోసం పోరాడిన స్థానికులకు, ఇతర ప్రాంతాల వారికి నివాళులర్పించిన మోదీ వారి కృషిని కొనియాడారు. భారత స్వాతంత్య్రంతో గోవా విమోచన పోరాటం ఆగిపోకుండా నాటి సమరయోధులు చూసుకున్నారన్నారు. స్వాతంత్య్రం వచ్చినా... దేశంలోని ఒక భాగమైన గోవా (డయ్యూ– డామన్‌తో కలిసి) ఇంకా పరాయిపాలనలోనే ఉందనే భావనతో స్వతంత్ర ఫలాలను భారతీయులు పూర్తిగా ఆస్వాదించలేకపోయారన్నారు. అందుకే పలువురు స్వాతంత్య్ర సమరయోధులు సర్వస్వం వదిలి గోవా ప్రజలతో కలిసి విమోచన కోసం పోరాడారన్నారు.

శతాబ్దాల తరబడి వలస పాలకుల ఆధీనంలో ఉన్నప్పటికీ గోవా ప్రజలు తమ భారతీయతను మర్చిపోలేదన్నారు. అలాగే మొఘలాయిల పాలనలో మగ్గిన భారత్‌ కూడా గోవాను ఏనాడూ మరువలేదన్నారు. సుపరిపాలనలో పలు అంశాల్లో ముందంజలో ఉన్నందుకు గోవా ప్రభుత్వాన్ని ప్రధాని అభినందించారు. తలసరి ఆదాయం, బడుల్లో బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు, ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీరు, ప్రతి గడపకూ వెళ్లి చెత్త సేకరణ, ఆహార భద్రత అంశాల్లో గోవా అగ్రస్థానాన ఉందని మోదీ వివరించారు. దివంగత మాజీ సీఎం మనోహర్‌ పారిక్కర్‌ను గుర్తుచేసుకున్నారు. గోవాకు ఉన్న వనరులు, అవకాశాలను చక్కగా గుర్తించి అభివృద్ధి పథాన నడిపారని పారిక్కర్‌ను కొనియాడారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మోదీ మిరామర్‌లో వాయుసేన, నావికాదళ విన్యాసాలను తిలకించారు.  
 

మరిన్ని వార్తలు