చర్చికి వెళ్లినంత మాత్రాన.. ఎస్సీ ధ్రువపత్రం రద్దు చేయరాదు 

8 Oct, 2021 06:21 IST|Sakshi

మద్రాస్‌ హైకోర్టు ఉత్తర్వులు

సాక్షి, న్యూఢిల్లీ: గోడలకు శిలువ తగిలించుకోవడం, చర్చికి వెళ్లినంత మాత్రాన... వాటిని కారణాలుగా చూపుతూ ఎస్సీ కుల ధ్రవీకరణ పత్రం రద్దు చేయరాదని మద్రాస్‌ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు హిందు పల్లన్‌ సామాజికవర్గానికి (ఎస్సీ) చెందిన పిటిషనర్‌ కుల ధ్రువీకరణ పత్రం రద్దు చేయాలంటూ తీసుకొన్న కింది కోర్టు నిర్ణయాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీబ్‌ బెనర్జీ, జస్టిస్‌ ఎం.దురైస్వామిల ధర్మాసనం పక్కనబెట్టింది. ‘‘పిటిషనర్‌ అయిన మహిళ హిందు పల్లన్‌ తల్లిదండ్రులకు జన్మించారనడంలో ఎలాంటి సందేహం లేదు.

పిటిషనర్‌ను ఓ క్రైస్తవుడు వివాహం చేసుకోవడం.. వారి పిల్లలు భర్త మతానికి చెందిన వారుగా గుర్తించడంతో పిటిషనర్‌ కుల ధ్రువీకరణ పత్రం రద్దు చేసినట్లు గుర్తించాం. పిటిషనర్‌ డాక్టర్‌ కావడంతో ఆమె క్లినిక్‌ను సందర్శించామని గోడలకు క్రాస్‌ వేలాడుతూ కనిపించిందని అధికారులు చెబుతున్నారు. ఆ కారణంగా మతాన్ని స్వీకరించారని నిర్ధారణకు రాలేం. పిటిషనర్‌ తన భర్త, పిల్లలతో చర్చికి వెళ్లినంత మాత్రాన అసలు విశ్వాసాన్ని పూర్తిగా వదిలేశారని భావించలేం’’ అని ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఊహాజనితంగా నిర్ణయం తీసుకొని కుల ధ్రువీకరణ పత్రం రద్దు చేయడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. 

మరిన్ని వార్తలు