అనిల్‌ అంబానీ వీడియో వైరల్‌.. చిక్కుల్లో గోల్ఫ్‌ కోర్స్‌

3 May, 2021 20:43 IST|Sakshi

ముంబై: దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతుంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కోవిడ్‌ కరాళ నృత్యం చేస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మహమ్మారి కట్టడి కోసం కఠిన ఆంక్షలు విధించింది. కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ అమలుతో కోవిడ్‌ కట్టడి కోసం తీవ్రంగా కృషి చేస్తోంది. అయితే ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్న జనాలు స్వీయ నియంత్రణ పాటించకపోతే.. కోవిడ్‌ను అదుపు చేయలేం. ఇలాంటి సమయంలో సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. జనాలకు ఆదర్శంగా నిలవాలి తప్ప వారి ఎవరికి ఇబ్బంది కలిగించకూడదు. కానీ కొందరు ప్రముఖులు తాము వీటన్నింటికి అతీతులం అనుకుంటారు. ఆంక్షలు లెక్కచేయకుండా నచ్చినట్లు ప్రవర్తించి ఇతరులను ఇబ్బంది పెడతారు. 

తాజాగా వ్యాపారవేత్త అనిల్‌ అంబానీ ఇలానే ప్రవర్తించారు. ఆయన చేసిన ఓ పని వల్ల ఓ ప్రైవేట్‌ గోల్ఫ్‌ కోర్స్‌ యజమాని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ వివరాలు.. మహారాష్ట్రలో ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ అనిల్‌ అంబానీ వాటిని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా.. కుటుంబంతో కలిసి మహాబలేశ్వర్‌ విహారయాత్రకు వెళ్లారు. ఈ క్రమంలో ఓ ప్రైవేట్‌ గోల్ఫ్‌ కోర్సులో అనిల్‌ అంబానీ తన కుటుంబ సభ్యులతో కలిసి ఈవినింగ్‌ వాక్‌ చేశారు. అయితే లాక్‌డౌన్‌ విధించడంతో ప్రస్తుతం సదరు గోల్ఫ్‌ కోర్సు  మార్నింగ్‌, ఈవినింగ్‌ వాక్‌ కోసం జనాలు ఎవరిని అనుమతించడం లేదు. 

సామాన్యులను అనుమతించని గోల్ఫ్‌ కోర్స్‌ అనిల్‌ అంబానీ కుటుంబాన్ని అనుమతించింది. వారు ఈవినింగ్‌ వాక్‌ చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మహాబలేశ్వర్‌ సివిల్‌ అధికారులు సదరు ప్రైవేట్‌ గోల్ఫ్‌ కోర్స్‌ అధికారులకు నోటీసులు జారీ చేయడమే కాక ఆ గ్రౌండ్‌ను మూసి వేశారు.

ఈ సందర్భంగా ఓ అధికారి మాట్లాడుతూ.. ‘‘అనిల్ అంబానీతో పాటు అతడి కుటుంబ సభ్యులు గోల్ఫ్‌ కోర్స్‌లో ఈవినింగ్‌ వాక్‌ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాంతో మేం సదరు గోల్ఫ్‌ కోర్స్‌ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశాం’’ అన్నారు. ఇక గోల్ఫ్‌ కోర్స్‌ అధికారి మాట్లాడుతూ ‘‘కోవిడ్‌ ఆంక్షలు అమల్లోకి రాకమునుపే అనిల్‌ అంబానీ కుటుంబం ఇక్కడకు వచ్చింది. వారు ఇక్కడ ఓ బంగ్లాలో ఉంటున్నారు’’ అని తెలిపారు. 

చదవండి: కోర్టు ఫీజుల కోసం నగలు అమ్ముకున్నా: అంబానీ

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు