గూగుల్‌లో.. హార్మోనియం వాయిస్తూ కనిపిస్తోంది ఎవరో తెలుసా?

8 Sep, 2022 15:04 IST|Sakshi

ట్రెండింగ్‌.. ఇవాళ గూగుల్‌ ఓపెన్‌ చేశారా?. పైన హార్మోనియం వాయిస్తున్నట్లు ఓ చిత్రం కనిపించిందా?. ఆ చిత్రంలో ఉంది ఎవరో కాదు.. భారత దేశం గర్వించదగ్గ ప్రముఖ సంగీత విద్వాంసుడు.. భూపేన్‌ హజారికా. ఇవాళ ఆయన జయంతి. అందుకే గూగుల్‌ అలా డూడుల్‌తో గౌరవించింది. 

భూపేన్‌ హజారికా.. సుధాకాంత(కోకిల)గా పాపులర్‌ అయిన ప్రముఖ సంగీత దర్శకుడు. ఆరు దశాబ్దాలపాటు తన గాత్రంతో సంగీత ప్రియుల్ని అలరించారాయన. వందల కొద్దీ పాటలు పాడి గాయకుడిగానే కాకుండా ఫిల్మ్‌మేకర్‌గా‌, రచయితగా కూడా సాహిత్య లోకానికి సేవలందించారు. మరోవైపు ఎమ్మెల్యేగానూ ఆయన రాజకీయ రంగంలో రాణించారు. అంతేనా.. నటుడిగా కూడా వందల చిత్రాల్లో అస్సామీ ఆడియెన్స్‌ను అలరించారు ఆయన. 


ఇద్దరూ గానకోకిలలే.. లతా మంగేష్కర్‌తో హజారికా (పాత చిత్రం)

హజారికా.. సెప్టెంబర్‌ 8, 1926లో అస్సాంలో జన్మించారు. బ్రహ్మపుత్ర తీరం వెంట ఆయన బాల్యం గడిచింది. ఆ తీరం వెంటే జానపద కథలు, గేయాలు వినుకుంటూ పెరిగారాయన. విశేషం ఏంటంటే.. హజారికా తన పదేళ్ల వయసులోనే తొలి పాటను రికార్డ్‌ చేశారు. 

► అస్సాంకు చెందిన ప్రముఖ రచయిత జ్యోతిప్రసాద్‌ అగర్వాల ప్రోత్సాహంతో హజారికా రాటుదేలారు.

► 1946లో బనారస్‌ హిందూ యూనివర్సిటీ నుంచి ఆయన ఎంఏ పూర్తి చేశారు. న్యూయార్క్‌లో కొంతకాలం జీవించిన ఆయన.. 1952  కొలంబియా యూనివర్సిటీ నుంచి మాస్‌ కమ్యూనికేషన్‌లో పీహెచ్‌డీ అందుకున్నారు. 

► హజారికా గాన ప్రస్థానం గువాహతి ఆల్‌ఇండియా రేడియో నుంచి మొదలైంది. బెంగాలీ పాటలను హిందీలోకి అనువదించి.. గాత్రం అందించారు. 

► ఆయన అందించిన సాహిత్యం.. గాత్రంలో నవరసాలు పండేవి. 

► రుడాలి, మిల్‌ గయి మాంజిల్‌ ముఝే, సాజ్‌, దార్‌మియారీ, గజగామిని, దామన్‌, క్యూన్‌ తదితర చిత్రాల్లో ఆయన పాడిన సూపర్‌ హిట్‌ సాంగ్స్‌ కల్ట్‌ క్లాసిక్‌గా మిగిలాయి. 

► ఈశాన్య భారతం నుంచి.. అస్సాం జానపద సాహిత్యాన్ని యావత్‌ దేశానికి పరిచయం చేసింది ఈయనే. 

► రాజకీయాల మీద ఆసక్తితో ఆయన అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు 1967లో పోటీ చేశారు. నౌబోయిచా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. అయితే.. తిరిగి 2004లోనూ లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ తరపు నుంచి పోటీ చేసి.. కాంగ్రెస్‌ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు.

► సంగీతానికి, సంప్రదాయానికి ఆయన అందించిన సేవలకుగానూ.. సంగీత నాటక అకాడమీ అవార్డుతో పాటు దాదాసాహెబ్‌ పాల్కే అవార్డు, పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. 

► 1998 నుంచి ఐదేళ్లపాటు సంగీత నాటక అకాడమీ చైర్మన్‌గా ఆయన పని చేశారు.

► 2011లో అనారోగ్యంతో ముంబై కోకిలాబెన్‌ ఆస్పత్రిలో చేరారు. ఐసీయూలో ఐదు నెలలపాటు చికిత్స పొందుతూ.. చివరికి అవయవాల పని ఆగిపోవడంతో నవంబర్‌ 5వ తేదీన కన్నుమూశారు. అస్సాంకు గౌరవం తీసుకొచ్చిన ఆయన అంత్యక్రియలకు లక్షల మంది హాజరయ్యారు.

► మరణాంతరం.. 2012లో ఆయనకు పద్మభూషణ్‌ పురస్కారం దక్కింది. 

► 2019లో దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న గౌరవం ఆయనకు దక్కింది.  

► అస్సామీ భాషలో మానవత్వం, సోదరభావం పెంపొందించేలా ఆయన పాటలు రాసి.. పాడారు. 

► తన జీవితంలో తొలినాళ్లలో.. కోయిబర్టా కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని  సంగీత విద్వాంసుడిగా అంగీకరించని అగ్రవర్ణ కులతత్వానికి వ్యతిరేకంగా పోరాడారు ఆయన. అయితే ఈ చర్యకు బదులుగా.. ఆయన ప్రేమించిన బ్రహ్మణ యువతిని ఆయనకు దూరం చేశారు. చివరికి.. కుల-వ్యతిరేక సమాజంపై ఆయన ప్రతీకారం తీరింది. అదెలాగంటే..  ఓ బ్రహ్మణ యువతిని వివాహం చేసుకోవడం ద్వారానే!.

► ముంబైకి చెందిన గెస్ట్‌ ఆర్టిస్ట్‌ రుతుజా మాలి, హజారికా 96వ జయంతి సందర్భంగా ఈ డూడుల్‌ను క్రియేట్‌ చేశారు. 

మరిన్ని వార్తలు