భారత్‌లో గూగుల్‌, ఫేస్‌బుక్‌ ఆదాయం వామ్మో.. సంప్రదాయ మీడియాకు భారీ గండి

15 Dec, 2021 06:01 IST|Sakshi

Google Facebook Income In India: సంప్రదాయ మీడియా సంస్థల్లో వచ్చే వార్తలను హోస్ట్‌ చేయడం ద్వారా ఫేస్‌బుక్, గూగుల్‌ వంటి దిగ్గజ టెక్‌ సంస్థలకు వస్తున్న ఆదాయం ఎంతో తెలుసా? ఈ మేరకు పార్లమెంట్‌ సాక్షిగా సమాధానం దొరికింది. 


‘భారత్‌లో డిజిటల్‌ ప్రకటనల విపణిలో 75 శాతం వాటాను గూగుల్, ఫేస్‌బుక్‌ హస్తగతం చేసుకున్నాయి. ఏడాదికి గూగుల్‌ ఏకంగా రూ.13,887 కోట్లు, ఫేస్‌బుక్‌ రూ.9,326 కోట్లు పొందుతున్నాయి. అంటే మొత్తంగా రూ.23,313 కోట్లు. ఇది దేశంలోని టాప్‌–10 సంప్రదాయక మీడియా సంస్థల మొత్తం ఆదాయం(కేవలం రూ.8,396 కోట్లు) కంటే చాలా ఎక్కువ’ అని బీజేపీ సీనియర్‌  నేత సుశీల్‌ మోదీ వివరించారు. ఈ మేరకు పలు కీలక అంశాలను మంగళవారం రాజ్యసభలో జీరో అవర్‌లో సుశీల్‌ మోదీ ప్రస్తావించారు.


ఇక్కడ మూటకట్టిన ఆదాయంలో 90శాతం మొత్తాలను తన అంతర్జాతీయ అనుబంధ సంస్థకు ఫేస్‌బుక్‌ పంపుతోందని, గూగుల్‌ ఇండియా తన 87 శాతం రాబడిని మాతృసంస్థకు బదలాయిస్తోందని సుశీల్‌ వెల్లడించారు. కొంత భాగం.. సంప్రదాయక మీడియాకూ దక్కాలని బీజేపీ సీనియర్‌  నేత సుశీల్‌ మోదీ అభిప్రాయపడ్డారు. సంప్రదాయ మీడియా కంటెంట్‌ మూలంగా ప్రకటనల ద్వారా వేలకోట్ల ఆదాయం పొందుతున్న టెక్‌ సంస్థలపై, ఈ వ్యవస్థపై పర్యవేక్షణకు కొత్తగా స్వతంత్య్ర నియంత్రణ మండలిని నెలకొల్పాలని ఆయన సూచించారు.

చదవండి: దిగ్గజ టెక్ కంపెనీలను వణికిస్తున్న "లాగ్4జే" లోపం

మరిన్ని వార్తలు