Google Search 2021 Trends: గూగుల్‌ సెర్చ్‌లో ట్రెండ్‌ కరోనాదే.. టాప్‌ 10 జాబితా ఇదే!

3 Jan, 2022 17:06 IST|Sakshi

Google Search 2021 Trends: ఏదైనా కొత్త విషయం తెలుసుకోవాలన్నా, ఏదైనా విషయం మీద వార్తలో, వివరాలో కావాలన్నా ఆశ్రయించేది ‘గూగుల్‌’నే. జనం దేనిపై ఆసక్తిగా ఉన్నారో, ఎప్పుడెప్పుడు దేని గురించి సెర్చ్‌ చేస్తున్నారో గూగుల్‌ ట్రెండ్స్‌ చెప్పేస్తుంది. అలా 2021లో భారతీయులు ఎక్కువగా వెతికినది దేని గురించో తెలుసా.. కరోనాకు సంబంధించే. ఇదొక్కటే కాదు.. వివిధ అంశాల్లో జనం దేనిగురించి ఎక్కువగా వెతికారో గూగుల్‌ ట్రెండ్స్‌ తాజాగా వెల్లడించింది. ఆ వివరాలేంటో చూద్దామా?  
– సాక్షి సెంట్రల్‌డెస్క్‌

టాప్‌–10లో ఉన్నవి ఇవీ.. 
మొత్తంగా ఏడాదంతా కలిపి చూస్తే.. గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌ టాప్‌లో.. కరోనా వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన కోవిన్‌ పోర్టల్‌ రెండో స్థానంలో నిలిచాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్, యూరో కప్, టోక్యో ఒలింపిక్స్, కోవిడ్‌ వ్యాక్సిన్, ఫ్రీఫైర్‌ గేమ్‌ రిడీమ్‌ కోడ్, కోపా అమెరికా, నీరజ్‌ చోప్రా, ఆర్యన్‌ ఖాన్‌ (షారూక్‌ఖాన్‌ కుమారుడు) గురించి నెటిజన్లు వెతికారు. 


 
దగ్గరిలో ‘కోవిడ్‌’గురించే.. 
మనం ఉన్న ప్రాంతంలో మనకు కావాల్సిన అవసరాల కోసం చేసే ‘నియర్‌ మి’సెర్చ్‌లో.. కోవిడ్‌ వ్యాక్సిన్, కోవిడ్‌ పరీక్షల కోసమే కోసమే జనం అత్యధికంగా వెతికారు. తర్వాతి స్థానాల్లో ఫుడ్‌ డెలివరీ, ఆక్సిజన్‌ సిలిండర్, కోవిడ్‌ హాస్పిటల్, టిఫిన్‌ సెంటర్, సీటీ స్కాన్, టేక్‌ఔట్‌ రెస్టారెంట్స్, ఫాస్టాగ్, డ్రైవింగ్‌ స్కూల్‌ నిలిచాయి. మొత్తంగా ‘నియర్‌ మి’సెర్చ్‌ టాప్‌–10లో ఐదు అంశాలు కరోనాకు సంబంధించినవే. 


 
ఎలా చేయాలనే లిస్టులోనూ.. 
ఏదైనా పని ఎలాచేయాలనే దానికి సంబంధించిన ‘హౌ టు’సెర్చ్‌లో నూ కరోనా అంశాలే ఎ క్కువగా నిలిచాయి. కోవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం ఎలాగనే దానిపైనే ఎ క్కు వ మంది సెర్చ్‌ చేశారు. ఆ తర్వాత వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ డౌన్‌లోడ్, ఆక్సిజన్‌ స్థాయిలు పెంచుకోవడమెలా? పాన్‌–ఆధార్‌ లింకేజీ, ఇంట్లో ఆ క్సిజన్‌ తయారీ, డోగె కాయిన్‌ (వర్చువల్‌ కరె న్సీ) కొనేదెలా? బనానా బ్రెడ్‌ తయారీ, బిట్‌కా యిన్‌లో ఇన్వెస్ట్‌ చేసేదెలాగనే వాటిపై వెతికారు. మార్కుల శాతాన్ని లెక్కించడం ఎలాగనేదానిపై చాలామంది సెర్చ్‌ చేయడం గమనార్హం

నీరజ్‌ చోప్రానే టాప్‌ 
భారతీయుల్లో ఎక్కువగా క్రీడాకారుడు నీరజ్‌ చోప్రా గురించి గూగుల్‌ సెర్చ్‌ చేశారు. బాలీవుడ్‌ హీరో షారూక్‌ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్, నటి షెహనాజ్‌ గిల్, నటి శిల్పాషెట్టి భర్త రాజ్‌ కుంద్రా, స్పేస్‌ ఎక్స్‌ అంతరిక్ష సంస్థ వ్యవస్థాపకుడు ఎలన్‌ మస్క్, నటుడు విక్కీ కౌశల్, క్రీడాకారులు పీవీ సింధు, భజరంగ్‌ పునియా, సుశీల్‌కుమార్, ఫ్యాషన్‌ డిజైనర్‌ నటాషా దలాల్‌ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. 


 
బ్లాక్‌ ఫంగస్‌ ఏంటని వెతుకుతూ.. 
ఏదైనా అంశం గురించి తెలుసుకునేందుకు వాడే ‘వాట్‌ ఈజ్‌’సెర్చ్‌లో గత ఏడాది ‘బ్లాక్‌ ఫంగస్‌’టాప్‌లో నిలిచింది. కరోనా రెండో వేవ్‌ సమయంలో.. బ్లాక్‌ ఫంగస్‌ కేసులు పెరిగిపోవడంతో అదేమిటనే దానిపై జనం గూగుల్‌లో వెతికారు. ఇక గణితానికి సంబంధించి.. ‘వందకు కారకం (ఫ్యాక్టోరియల్‌ ఆఫ్‌ హండ్రెడ్‌)’ఏమిటి? తాలిబాన్‌ ఏంటి? అఫ్గానిస్తాన్‌లో ఏం జరుగుతోంది? రెమ్‌డెసివిర్‌ ఏమిటి, నాలుగుకు స్వే్కర్‌ రూట్‌ ఏమిటి? స్టెరాయిడ్లు, టూల్‌కిట్, స్క్విడ్‌గేమ్, డెల్టాప్లస్‌ వేరియంట్‌ ఏమిటన్న దానిపై నెటిజన్లు సెర్చ్‌ చేశారు. 


వార్తల్లో నిలిచినవేంటి? 
ఎప్పటికప్పుడు జరిగే వార్తాంశాల సెర్చింగ్‌లో గత ఏడాది టోక్యో ఒలింపిక్స్‌ టాప్‌లో నిలిచింది. బ్లాక్‌ ఫంగస్, అఫ్గానిస్తాన్‌ వార్తలు, బెంగాల్‌ ఎన్నికలు, టౌక్టీ తుఫాను, కరోనా రెండోవేవ్‌ లాక్‌డౌన్, సూయజ్‌ కెనాల్‌లో నౌక చిక్కకుపోయిన సంక్షోభం, ఢిల్లీ శివార్లలో రైతుల ఆందోళనలు, బర్డ్‌ఫ్లూ వ్యాప్తి, యాస్‌ తుఫానుకు సం బంధించిన వార్తలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి.  

పాత, కొత్త రుచుల కోసం.. 
గత ఏడాది లాక్‌డౌన్‌ సమయంలో చాలా మంది గూగుల్‌లో వివిధ రకాల వంటలు ఎలా చేయాలనేదానిపై విపరీతంగా సెర్చ్‌ చేశారు. అందులో పాత, కొత్త రుచుల కలయిక ఉండటం గమనార్హం. ఇనోకి మష్రూమ్‌ (పుట్టగొడుగుల వంటకం) ఇందులో టాప్‌లో నిలిచింది. తర్వాతి స్థానాల్లో మోదక్, మేతీ మటర్‌ మలాయి, పాలక్, చికెన్‌ సూప్, పోర్న్‌స్టార్‌ మర్తిని (కాక్‌టెయిల్‌), లసగ్నా, కుకీస్, మటర్‌ పనీర్, కడా వంటకాలు నిలిచాయి.    

మరిన్ని వార్తలు