గోరటి ‘వల్లంకి తాళం’ని వరించిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

31 Dec, 2021 01:23 IST|Sakshi

తెలంగాణకు మరో 2 పురస్కారాలు

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ సాహిత్యం తన ప్రతిభను చాటింది. సాహితీ ప్రపంచంలో సగర్వంగా నిలబడింది. ఏకంగా మూడు ప్రతిష్టాత్మక అవార్డులు చేజిక్కించుకుంది. తెలంగాణకు చెందిన ముగ్గురు కవులను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు వరించాయి. ‘పల్లె కన్నీరు పెడుతుందో..’అంటూ ‘కుబుసం’సినిమాలోని పాటతో బహుళ ప్రజాదరణ పొందిన జానపద గాయకుడు, రచయిత, కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు –2021 దక్కింది. ఆయన రచించిన ‘వల్లంకి తాళం’అనే
కవితా సంపుటికి ఈ అవార్డు లభించింది.

డాక్టర్‌ సి.మృణాళిని, జి.శ్రీరామమూర్తి, డాక్టర్‌ కాత్యాయిని విద్మహేలతో కూడిన జ్యూరీ.. ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు తెలుగు విభాగంలో ‘వల్లంకి తాళాన్ని’ఎంపిక చేసింది. కాగా కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం తగుళ్ల గోపాల్‌ను వరించింది. ‘దండ కడియం’అనే కవితా సంపుటికి గాను ఆయనకు ఈ పురస్కారం లభించింది. ఇక కేంద్ర సాహిత్య అకాడమీ బాల పురస్కారం దేవరాజు మహారాజు రచించిన ‘నేను అంటే ఎవరు?’అనే నాటకానికి దక్కింది. కేంద్ర సాహిత్య అకాడమీ మొత్తం ఏడు కవితా సంపుటిలు, రెండు నవలలు, ఐదు చిన్న కథలు, రెండు నాటకాలు, ఒకటి చొప్పున బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ, క్రిటిసిజం, ఎపిక్‌ పొయిట్రీలను 2021 సాహిత్య అకాడమీ పురస్కారాలకు ఎంపిక చేసింది. గుజరాతీ, మైథిలి, మణిపురి, ఉర్దూ భాషల అవార్డులను త్వరలో ప్రకటిస్తామని అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ అయ్యర్, కార్యదర్శి కె.శ్రీనివాసరావులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గోరటి వెంకన్న తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌ జిల్లా గౌరారం గ్రామానికి చెందిన వారు కాగా, తగుళ్ల గోపాల్‌ తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం కలకొండ గ్రామంలో జన్మించారు. ఇక దేవరాజు మహారాజు వరంగల్‌ జిల్లాకు చెందినవారు.

జీవితానికి ఇది చాలు..
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఈ అవార్డు తీసుకుంటే ఈ జీవితానికి ఇది చాలు అన్నంత గొప్ప పురస్కారమిది.
ఎక్కడో మారుమూల పల్లెలో పుట్టిన నేను, ఒక విధానం, సిద్ధాంతం, ఒక ఫ్రేమ్‌వర్క్‌లో ఇమిడి, వదగని నేను అదే పరంపరతో సాహిత్య కృషి కొనసాగించాను. 
– గోరటి వెంకన్న 

మరిన్ని వార్తలు