ఆ దేశానికి వెళ్లే విద్యార్థులు జాగ్రత్త.. కేంద్రం కీలక సూచన

23 Sep, 2022 15:55 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కెనడాలోని భారతీయులు, ఆ దేశానికి వెళ్లాలనుకుంటున్న విద్యార్థులకు కేంద్రం శుక్రవారం కీలక సూచనలు చేసింది. కెనడాలో విద్వేష దాడులు, భారతీయులను లక్ష‍్యంగా చేసుకుని నేరాలు, హింస పెరుగుతోందని తెలిపింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆ దేశంలో ఉన్న భారతీయులు, భవిష్యత్తులో అక్కడకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్న విద్యార్థులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని విదేశాంగ శాఖ సూచించింది.

భారతీయులు లక్ష‍్యంగా కెనడాలో జరుగుతున్న దాడులపై ఆ దేశంతో చర్చించినట్లు కేంద్రం పేర్కొంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఇప్పటివరకు జరిగిన నేరాల్లో ఒక్క బాధ్యుడ్ని కూడా శిక్షించలేదని గుర్తుచేసింది. సిక్కులకు ప్రత్యేక దేశం కోరతూ ఖలిస్థాన్ అనుకూల శక్తులు కెనడాలో ప్రజాభిప్రాయ సేకరణ చేయడం దౌత్యపరంగా వివాదానికి దారీ తీసిన సమయంలోనే కేంద్రం ఈ సూచన చేయడం గమనార్హం.

విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ఈ ప్రజాభిప్రాయ సేకరణను ఉగ్రవాద, రాడికల్ శక్తుల హాస్యాస్పద చర్యగా అభివర్ణించారు. భారత్‌తో మంచి సంబంధాలున్న దేశం దీన్ని అనుమతించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

కెనడాలో 16 లక్షల మంది భారత సంతతి వ్యక్తులు ఉన్నారు. ఈ సంఖ్య ఆ దేశ జనాభాలో మూడు శాతం. అయితే ఇటీవల కాలంలో అక్కడ జాతి విద్వేష దాడులు జరుగుతున్నాయి. భారతీయులు లక్ష‍్యంగా దుండగులు కాల్పులతో రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం కీలక  సూచనలు చేసింది.
చదవండి: కెనడాలో కాల్పుల కలకలం.. భారతీయ విద్యార్థి మృతి

మరిన్ని వార్తలు