వీసాల పునరుద్ధరణ తక్షణం అమల్లోకి

23 Oct, 2020 04:31 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎనిమిది నెలల క్రితం రద్దు చేసిన వీసాలను మళ్లీ పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వం గురువారం నిర్ణయించింది. ఎలక్ట్రానిక్, టూరిస్టు, మెడికల్‌ కేటగిరీ మినహా మిగిలిన అన్ని రకాల వీసాలను పునరుద్ధరిస్తారు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. భారత్‌ను సందర్శించేందుకు గాను ఓవర్సీస్‌ సిటిజెన్‌ ఆఫ్‌ ఇండియా(ఓసీఐ), పర్సన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజిన్‌(పీఐఓ) కార్డుదారులకు, ఇతర విదేశీయులకు టూరిస్టు వీసా మినహా ఇతర వీసాలు మంజూరు చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. దీని ద్వారా విదేశీయులు ఇండియాకు వచ్చేందుకు మార్గం సుగమమైంది.

దేశ సందర్శనకు కాకుండా వారు వ్యాపారం, సదస్సులు, ఉద్యోగాలు, విద్యాభ్యాసం, పరిశోధనల కోసం ఇండియాకు రావొచ్చు. కరోనా వైరస్‌ బయటపడడంతో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి విదేశాల నుంచి జనం రాకపోకలను ప్రభుత్వం నిలిపివేసింది. అన్‌లాక్‌లో భాగంగా ఆంక్షలను క్రమంగా సడలిస్తోంది. అలాగే వీసాలు, విదేశీ ప్రయాణాలపై ఆంక్షలను ఎత్తివేస్తోంది. అందులో భాగంగా వీసాలను పునరుద్ధరించింది. ఒకవేళ వాటి గడువు తీరిపోతే మళ్లీ వీసాలు పొందవచ్చని కేంద్రం సూచించింది. విదేశీయులు భారత్‌లో వైద్య చికిత్స పొందాలని భావిస్తే మెడికల్‌ వీసా కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. విదేశాల నుంచి ఇండియాకు వచ్చేవారు కేంద్ర ఆరోగ్యశాఖ జారీ చేసిన కోవిడ్‌ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని తెలియజేసింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా