కరోనాతో చనిపోతే రూ.2లక్షలు వస్తాయా?

30 Apr, 2021 18:18 IST|Sakshi

కరోనాతో ఎవరైనా మీ బందుమిత్రులలో మరణిస్తే ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన(పీఎంజెజెబీవై), ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన(పీఎంఎస్ బీవై) పథకాల కింద వారికి రెండు లక్షలు పరిహారం కేంద్రం ఇస్తున్నట్లు వాట్సాప్, ఇతర సోషల్ మీడియాలో ఒక మెసేజ్ తెగ వైరల్ అవుతుంది. ఆ పోస్ట్ లో ఇలా ఉంది.. “కోవిడ్ -19 కారణంగా లేదా ఏదైనా కారణం చేత మీ దగ్గరి బంధువు/స్నేహితుల సర్కిల్‌లో ఎవరైనా మరణించినట్లయితే ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఖాతా స్టేట్‌మెంట్ లేదా పాస్‌బుక్ ఎంట్రీని బ్యాంకులో అడగండి. ఖాతా స్టేట్‌మెంట్ లో ఈ మధ్యలో రూ.12 లేదా రూ.330 కట్ అయిందేమో గుర్తించండి, ఒకవేల కట్ అయితే వారు బ్యాంకుకు వెళ్లి రూ.2లక్షల కోసం బీమా క్లెయిమ్ చేసుకోండి".

ప్రస్తుతం కోవిడ్ సంక్షోభంతో దేశం పోరాడుతున్న సమయంలో అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో నకిలీ వార్తలు విస్తృతంగా వ్యాపిస్తున్నాయి. అటువంటి వాటిలో ఇది ఒకటి. దేశవ్యాప్తంగా పొదుపు బ్యాంకు ఖాతాలు గల పౌరులకు సరసమైన ప్రీమియంతో సామాజిక భద్రత కల్పించడానికి 2015లో ప్రభుత్వం ఈ రెండు పథకాలను జన ధన్ - జన్ సురక్ష యోజన కింద ప్రారంభించింది. కోవిడ్ మరణాలకు(కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే) పీఎంజెజెబీవై పథకం వర్తిస్తుందనేది నిజమే కానీ, పీఎంఎస్ బీవై కింద ప్రమాదవశాత్తు మరణం పొందిన లేదా 18 నుండి 70 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారికి ప్రమాదంలో శాశ్వత వైకల్యం చెందితే రూ.2 లక్షల బీమా అందిస్తుంది. కోవిడ్ -19 మరణాలను ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం ప్రమాదవశాత్తు మరణం కింద పరిగణించరు. ఇందులో చెప్పినట్టు పీఎంజెజెబీవై కింద ఉన్నవారు ఎవరైనా మరణిస్తే కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే లభిస్తాయని, పీఎంఎస్ బీవై  కింద లభించవు అని పీఐబి ఫాక్ట్ చెక్ పేర్కొంది.

చదవండి:

ఏటీఎం కార్డు పోతే ఇలా చేయండి..!

మరిన్ని వార్తలు