అధికారులను అనవసరంగా కోర్టులకు పిలవొద్దు..

10 Jul, 2021 07:32 IST|Sakshi

మీరేమీ చక్రవర్తులు కారు.. అలా పిలవటం వల్ల మీ గౌరవం పెరిగిపోదు

మీకు నచ్చినట్లుగా ప్రభుత్వాలు నడవాలనుకోవద్దు

కొన్ని హైకోర్టులకు ఇది అలవాటైపోయింది

న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలకు పరిధులున్నాయ్‌

ఒకరి అధికారాల్ని మరొకరు ఆక్రమించాలనుకోకూడదు

ప్రభుత్వాధికారుల నిర్ణయాలు ప్రజలకోసమే.. సొంతానికి కాదు

అవి తప్పు అనిపిస్తే వాటిని కొట్టేసే హక్కు కోర్టులకెటూ ఉంది

దానిపై తీరని సందేహాలుంటే మీ ఉత్తర్వుల్లో వాటిని రాయండి

తగిన సమయమిచ్చి ప్రభుత్వం నుంచి సమాధానం తీసుకోండి

అంతేతప్ప అధికారుల్ని పదేపదే పిలిచి మీ గౌరవం తగ్గించుకోవద్దు

ఇదెంతమాత్రం హర్షణీయం కాదు... తీవ్రంగా ఖండించాల్సిన విషయం

సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టీకరణ; అలహాబాద్‌ హైకోర్టు ఉత్తర్వుల కొట్టివేత

సాక్షి, న్యూఢిల్లీ: ప్రతి చిన్న విషయానికీ ప్రభుత్వాధికారులను కోర్టులకు పిలుస్తున్న కొన్ని హైకోర్టుల తీరును సర్వోన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. ఇది ఎంతమాత్రం హర్షణీయం కాదని, అత్యంత తీవ్రమైన పదాలతో ఖండించాల్సిన అంశమని ఉద్ఘాటించింది. ప్రభుత్వాధికారులను అనవసరంగా కోర్టులకు పిలవవద్దని ఈ సందర్భంగా హితవు చెప్పింది. మేం పిలిచాం కనక ఆగమేఘాలపై రావాల్సిందే అన్నట్లు కొన్ని కోర్టులు వ్యవహరిస్తున్నాయని... తద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వారిపై ఒత్తిడి తెస్తున్నాయని జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్, జస్టిస్‌ హేమంత్‌ గుప్తాలతో కూడిన ధర్మాసనం స్పష్టంచేసింది. ఓ కేసులో కోర్టుకు హాజరు కావాలంటూ వైద్యారోగ్య శాఖ కార్యదర్శిని అలహాబాద్‌ హైకోర్టు ఆదేశించటంపై సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలైంది. దీన్ని విచారణకు స్వీకరిస్తూ సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ‘‘అధికారులు తక్షణం హాజరు కావాలంటూ హుకుం జారీ చేయటం... తద్వారా వారిపై ఒత్తిడి పెంచటమనే ప్రక్రియ కొన్ని హైకోర్టులకు అలవాటైపోయింది. కొన్ని న్యాయస్థానాలు తమకు నచ్చినట్టుగా అధికారులు పనిచేయాలనే ఉద్దేశంతో వారిని ఒత్తిడి చేస్తున్నాయి. న్యాయవ్యవస్థకు– కార్యనిర్వాహక వ్యవస్థకు ఉండే అధికారపు అధీన రేఖను దాటాలని చూస్తున్నాయి’’ అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది.  

వారి విధులు వారికున్నాయ్‌... 
కార్యనిర్వాహక వ్యవస్థలోని ప్రభుత్వాధికారులు పాలనలో ప్రధాన భాగంగా వారి బాధ్యతలు వారు నిర్వర్తిస్తున్నారని సుప్రీంకోర్టు పేర్కొంది. ‘‘అధికారుల చర్యలైనా, నిర్ణయాలైనా వారి సొంత ప్రయోజనాల కోసం కాదు. ప్రజాధనానికి జవాబుదారు కనక వ్యవస్థ ప్రయోజనాల కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదు. ఒకవేళ న్యాయసమీక్షలో అవి నిలబడవనుకుంటే ఆ నిర్ణయాలను కొట్టేసే పరిస్థితి హైకోర్టులకు ఎటూ ఉంటుంది. అంతేకానీ వాటికోసం అధికారులను పదేపదే పిలవటం హర్షణీయం కాదు. ఈ తీరును ఖండించి తీరాలి’’ అని బెంచ్‌ స్పష్టంచేసింది.  

జడ్జిలు తమ పరిధి తెలుసుకోవాలి... 
ఈ సందర్భంగా అరావళి గోల్ఫ్‌క్లబ్‌ వెర్సస్‌ చంద్రహాస్‌ మధ్య నడిచిన కేసును సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ‘‘న్యాయమూర్తులు వినయ విధేయతలతో మెలగాలి. వాళ్లేమీ చక్రవర్తులు కారు. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థ మూడింటికీ ఎవరి పరిధులు వారికున్నాయి. ఒకరి అధికారాల్లోకి మరొకరు చొచ్చుకురావాలనుకోవటం సరికాదు. అలాచేస్తే రాజ్యాంగ సమతౌల్యం దెబ్బతింటుంది. ఫలితం అనుభవించాల్సి వస్తుంది’’ అని ధర్మాసనం తేల్చిచెప్పింది. అధికారులకు ఎన్నో ముఖ్యమైన పనులుంటాయని, అనవసరంగా కోర్టులకు పిలవటం వల్ల అవన్నీ ఆలస్యమవుతాయని, పైపెచ్చు సదరు అధికారిపై అదనపు భారం పడుతుంది కనక ఆ పనులు మరింత ఆలస్యమవుతాయని కోర్టు స్పష్టంచేసింది. ఈ సందర్భంగా కిందికోర్టు ఉత్తర్వులను కొట్టేసింది.  

మీ గౌరవమేమీ పెరగదు... 
‘‘కోర్టులకు ప్రభుత్వాధికారుల్ని అనవసరంగా పిలవవద్దని మరోసారి చెబుతున్నాం. వాళ్లనలా పిలవటం వల్ల మీ గౌరవమేమీ పెరిగిపోదు. కోర్టుల పట్ల గౌరవాన్ని సంపాదించుకోవాలి తప్ప ఆపాదించుకోకూడదు. ఒక అధికారి కోర్టుకు వచ్చాడంటే తన అవసరం ఉన్న మరో పని ఆగిపోతుందని గమనించండి. కొన్నిసార్లు కోర్టు పిలుపుల కోసం అధికారులు దూరాభారాలు ప్రయాణించాల్సి వస్తోంది. కాబట్టి అధికారుల్ని పిలవటమనేది ప్రజాహితానికి వ్యతిరేకం. పోనీ కోర్టు తీర్పులేమైనా నిర్ణీత సమయంలో వస్తాయా అంటే అలాంటి పరిస్థితేమీ లేదు. ఎంత ఆలస్యమవుతుందో చెప్పలేం. అధికారులు రాకున్నా... దాన్ని మించిన కలం కోర్టుల చేతిలో ఉంది. దాన్ని ఉపయోగించండి. ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో కోర్టు పేర్కొన్న అంశాలకు ప్రభుత్వం తరఫున హాజరయ్యే న్యాయవాది సమాధానమివ్వలేదనుకోండి... ఆ సందేహాన్ని ఉత్తర్వుల్లో రాయండి. ప్రభుత్వమో, ప్రభుత్వాధికారో దానికి జవాబివ్వటానికి తగిన సమయమివ్వండి’’ అని బెంచ్‌ స్పష్టంగా నిర్దేశించింది. ఆలోచన లేకుండా, తరచుగా, క్యాజువల్‌గా అధికారులను కోర్టులకు పిలవటాన్ని ఎంతమాత్రం హర్షించబోమని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది.    

మరిన్ని వార్తలు