ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌‌ చదువులు డొల్లే!

19 Sep, 2020 16:03 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రాణాంతక కోవిడ్‌ వైరస్‌ను కట్టడి చేయడంలో భాగంగా దేశవ్యాప్తంగా విద్యాసంస్థలను మూసివేయాల్సి రావడంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్‌ మీడియా ద్వారా విద్యా బోధన విధానాన్ని అనసరించాల్సి వచ్చిన విషయం తెలిసిందే. ప్రైవేటు పాఠశాలలను పక్కన పెట్టి, ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యా సంస్థల్లో ఈ విద్యా విధానం ఏ మేరకు విజయవంమైందో తెలుసుకునేందుకు ‘ఆక్స్‌ఫామ్‌ ఇండియా’ స్వచ్ఛందంగా ఓ సర్వే నిర్వహించింది. ఈ సంస్థ ప్రతినిధులు సర్వేలో భాగంగా ఇటీవల బిహార్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రాల్లో పర్యటించి ఉపాధ్యాయులను, విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను తెలుసుకుంది.

డిజిటల్‌ విద్యావిధానం తమ పిల్లలకు అందుబాటులోకి రాలేదని 80 శాతం మంది తల్లిదండ్రులు ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 15 శాతం మంది జనాభాకే ఇంటర్నెట్‌ సదుపాయం అందుబాటులో ఉంది. ఆ జనాభాలో కూడా దళితులు, ఆదివాసీలు, ముస్లింలకు కూడా నెట్‌ సదుపాయం అందుబాటులో లేదు. ఆన్‌లైన్‌ తరగతులు అందుబాటులో ఉన్న విద్యార్థులకు కూడా పెద్ద ప్రయోజనం కలగలేదని, అందుకు కారణం ఆన్‌లైన్‌ క్లాసులకు అనుగుణంగా తగిన పాఠ్య పుస్తకాలు అందుబాటులో లేకపోవడమేనని 80 శాతం మంది తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు.
(చదవండి: ఆన్‌లైన్‌ క్లాసుల్లో పరిస్థితి ఇలానే ఉంటుందేమో?)


ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభానికే ముందే వాటికి సంబంధించిన పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు అందుబాటులో ఉండాలని, అలా లేకపోవడం దురదష్టకరమని 71 శాతం మంది టీచర్లు అభిప్రాయపడ్డారు. డిజిటల్‌ తరగతుల విధానం దేశంలో కొత్త కాకపోయినా, కొన్ని సామాజిక వర్గాలకు నెట్‌ సదుపాయం అందుబాటులో లేదని ‘ప్రథమ్‌ ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌’ సీఈవో రుక్మిణి బెనర్జీ తెలిపారు. కఠిన పరిస్థితుల్లో డిజిటల్‌ తరగతులు ఆయా సామాజిక వర్గాల విద్యార్థులకు అందుబాటులోకి రాలేదని ఆమె వ్యాఖ్యానించారు.

ఇంతకాలం పాటు విద్యా సంస్థలు మూత పడతాయని ఎవరూ ఊహించలేక పోయారని ఆమె చెప్పారు. గత మార్చి నెలలో లాక్‌డౌన్‌ కారణంగా పాఠశాలలను మూసివేయగా, జూన్‌ నెలలో ఆన్‌లైన్‌ క్లాసులను ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలకు వెనక బడిన వర్గాల పిల్లల్లో ఎక్కువ మంది మధ్యాహ్న భోజన పథకం కోసమే వస్తారు. ఇక వారు ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరవుతారనుకోవడం కలలోని మాటే. మధ్యాహ్న భోజనంతోపాటు వారికిచ్చే లర్నింగ్‌ పరికరాలను కూడా పునరుద్ధరించాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ 35 శాతానికి మించి పిల్లలకు ఈ సదుపాయం అందడం లేదని సర్వేలో తేలింది. 
(చదవండి: ఇంటివద్దకే బడి)

మరిన్ని వార్తలు