ఆక్సిజన్, టీకాల దిగుమతికి ఊపు

25 Apr, 2021 06:07 IST|Sakshi

దిగుమతి సుంకం, హెల్త్‌ సెస్‌ మినహాయింపు

కరోనా ఉధృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం

వచ్చే మూడు నెలలపాటు వర్తింపు

ఆక్సిజన్‌ లభ్యతపై ప్రధాని సమీక్ష

సాక్షి, న్యూఢిల్లీ:  మెడికల్‌ గ్రేడ్‌ ఆక్సిజన్, ఆక్సిజన్‌ సంబంధిత 15 పరికరాలపై దిగుమతి సుంకాన్ని మూడు నెలలపాటు కేంద్ర ప్రభుత్వం మినహాయించింది. వీటిపై హెల్త్‌ సెస్‌ను కూడా తొలగించింది. ఈ మినహాయింపు వెంటనే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. అంతేకాకుండా కోవిడ్‌–19 టీకాల దిగుమతిపైనా మూడు నెలలపాటు దిగుమతి సుంకాన్ని మినహాయించింది. దేశంలో ఆక్సిజన్‌ లభ్యతను పెంచేందుకు తీసుకున్న చర్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆక్సిజన్‌ సంబంధిత పరికరాలు, టీకాల దిగుమతిపై సుంకం మినహాయింపులు ఇవ్వాలని నిర్ణయించారు. ఆసుపత్రులు, ఇళ్లలో కరోనా చికిత్సకు మెడికల్‌ గ్రేడ్‌ ఆక్సిజన్‌ సరఫరాతోపాటు రోగుల సంరక్షణకు అవసరమైన పరికరాల సరఫరాను వెంటనే పెంచాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి సూచించారు. ఆక్సిజన్, వైద్య సామగ్రి లభ్యతను పెంచడానికి అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు సమన్వయంతో పని చేయాలన్నారు.

కోవిడ్‌–19 వ్యాక్సిన్లపై..
కోవిడ్‌ వ్యాక్సిన్ల దిగుమతిపై బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీని 3 నెలల కాలానికి మినహాయించాలని నిర్ణయించారు. దీనివల్ల ఆక్సిజన్, వైద్య పరికరాల లభ్యత పెరుగుతుందని, చవకగా లభిస్తాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆయా పరికరాల దిగుమతికి కస్టమ్స్‌ క్లియరెన్స్‌లో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని రెవెన్యూ శాఖను ప్రధానమంత్రి ఆదేశించారు. ఆయా పరికరాల కస్టమ్స్‌ క్లియరెన్స్‌కు సంబంధించిన సమస్యల పరిష్కారానికి రెవెన్యూ శాఖ కస్టమ్స్‌ జాయింట్‌ సెక్రెటరీ గౌరవ్‌ను నోడల్‌ అధికారిగా ప్రభ్వుత్వం నామినేట్‌ చేసింది. సాధారణంగా మెడికల్‌ ఆక్సిజన్‌పై 5 శాతం, వ్యాక్సిన్లపై 10 శాతం దిగుమతి సుంకం విధిస్తారు. దేశంలో కరోనా తాజా పరిస్థితి నేపథ్యంలో ఈ సుంకాల నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఆక్సిజన్‌ సంబంధిత పరికరాలపై 5 నుంచి 15 శాతం కస్టమ్స్‌ డ్యూటీ, 5 శాతం హెల్త్‌ సెస్‌ వసూలు చేస్తారు. వీటి నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చేసింది.

మినహాయింపు లభించేవి
► మెడికల్‌ గ్రేడ్‌ ఆక్సిజన్‌ 
► ఆక్సిజన్‌ జనరేటర్లు  
► ఫ్లో మీటర్, రెగ్యులేటర్, కనెక్టర్లు, ట్యూబుల సహిత ఆక్సిజన్‌ కాన్‌సంట్రేటర్‌
► వాక్యూమ్‌ ప్రెజర్‌ స్వింగ్‌ అబ్సార్ప్‌షన్, ప్రెజర్‌ స్వింగ్‌ అబ్సార్ప్‌షన్‌ ఆక్సిజన్‌ ప్లాంట్స్, క్రయోజనిక్‌ ఆక్సిజన్‌ ఎయిర్‌ సెపరేషన్‌ యూనిట్స్‌  
► ఆక్సిజన్‌ కానిస్టర్‌
► ఆక్సిజన్‌ ఫిల్లింగ్‌ సిస్టమ్స్‌  
► ఆక్సిజన్‌ నిల్వ ట్యాంకులు, ఆక్సిజన్‌ సిలిండర్స్, ట్యాంక్స్, క్రయోజెనిక్‌ సిలిండర్లు
► ఆక్సిజన్‌ రవాణా కోసం ఐఎస్‌వో కంటైనర్లు
► ఆక్సిజన్‌ రవాణా కోసం క్రయోజెనిక్‌ రోడ్‌ రవాణా ట్యాంకులు
► ఆక్సిజన్‌ ఉత్పత్తి, రవాణా, పంపిణీ లేదా నిల్వ కోసం పరికరాల తయారీకి విడిభాగాలు
► ఆక్సిజన్‌ ఉత్పత్తి చేయగల ఇతర పరికరాలు  
► వెంటిలేటర్లు, కంప్రెషర్లు, విడిభాగాలు
► హై ఫ్లో నాజల్‌ కాన్యులా డివైజ్‌
► నాన్‌–ఇన్వేసివ్‌ వెంటిలేషన్‌లో వాడే హెల్మెట్లు
► ఐసీయూ వెంటిలేటర్లకు నాన్‌–ఇన్వేసివ్‌ వెంటిలేషన్‌ ఓరోనాసల్‌ మాస్క్‌లు
► ఐసీయూ వెంటిలేటర్లకు నాన్‌–ఇన్వేసివ్‌ వెంటిలేషన్‌ నాసల్‌ మాస్క్‌లు  

మరిన్ని వార్తలు