లేహ్‌ చైనాలో భాగం.. ట్విట్టర్‌కు స్ట్రాంగ్‌ వార్నింగ్‌

22 Oct, 2020 14:01 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ భూభాగాలను తప్పుగా చూపించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం ట్విట్టర్‌ సీఈవో జాక్‌ డోర్సీకి లేఖ రాసింది. భారత సార్వభౌమత్వాన్ని, సమగ్రతను అగౌరవపరిచేందుకు చేసే ఏ ప్రయత్నము ఆమోదయోగ్యం కాదని తీవ్రంగా హెచ్చరించింది. జమ్మూ కశ్మీర్‌లోని లేహ్‌ భూభాగాన్ని ట్విట్టర్‌ పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనాలో భాగంగా చూపించడంతో ప్రభుత్వం ట్విట్టర్‌ సీఈఓకి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ, ఐటి కార్యదర్శి అజయ్ సాహ్నీ మాట్లాడుతూ.. ‘లేహ్‌ లద్దాఖ్‌కు ప్రధాన కార్యాలయం. జమ్మూ కశ్మీర్‌, లద్దాఖ్లు రెండు కూడా భారత రాజ్యాంగం పాలించే ఇండియాలోని సమగ్ర, విడదీయరాని భాగాలు. మ్యాప్‌ల ద్వారా ప్రతిబింబించే భారతదేశం సార్వభౌమత్వాన్ని, సమగ్రతను అగౌరవపరిచేందుకు ట్విట్టర్‌ చేసే ఏ ప్రయత్నమైనా పూర్తిగా చట్టవిరుద్ధం.. ఆమోదయోగ్యం కాదు’ అంటూ తీవ్రంగా హెచ్చరించారు. (చదవండి: లద్దాఖ్‌లో పట్టుబడ్డ చైనా జవాను)

అంతేకాక ఇలాంటి ప్రయత్నాలు ట్విట్టర్‌కు అపఖ్యాతిని కలిగించడమే కాక మధ్యవర్తిగా దాని తటస్థత గురించి ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని ప్రభుత్వం లేఖలో పేర్కొంది. దీనిపై ట్విట్టర్‌ ప్రతినిధి స్పందిస్తూ.. భారత ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి కట్టుబడి ఉన్నాము. ఈ విషయంలోని సున్నితత్వాన్ని మేము గౌరవిస్తాము. లేఖను అంగీకరిస్తాము’ అని తెలిపారు. 

మరిన్ని వార్తలు