రైతులకు ఆసరా : సీఎంకు గవర్నర్‌ లేఖ

10 Aug, 2020 17:15 IST|Sakshi

రైతులకు జరిగిన అన్యాయం సరిదిద్దండి

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి రాసిన లేఖలో బెంగాల్‌ గవర్నర్‌ జగ్దీప్‌ ధంకర్‌ కోరారు. 70 లక్షల మంది రైతులకు ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి ప్రయోజనాలు దక్కకపోవడం గర్హనీయమని, రైతులకు హక్కుగా దక్కాల్సిన రూ 8400 కోట్లను ఇప్పటికే రాష్ట్రం కోల్పోయిందని సీఎం మమతా బెనర్జీకి రాసిన లేఖలో గవర్నర్‌ ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ప్రతిరైతూ ఇప్పటివరకూ 12,000 రూపాయల నగదు పొందగా, రాష్ట్ర ప్రభుత్వ వివాదాస్పద వైఖరితో బెంగాల్‌ రైతులు వారికి దక్కాల్సిన మొత్తాన్ని పొందలేకపోయారని గవర్నర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయాన్ని తాను మీతో పాటు ప్రభుత్వ అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకువచ్చానని దీదీకి రాసిన లేఖలో గవర్నర్‌ ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన రైతులను గుర్తిస్తే కేంద్ర ప్రభుత్వం వారి ఖాతాల్లోకి నగదు బదిలీ చేస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఈ ప్రక్రియను చేపట్టడం లేదో తనకు అర్ధం కావడం లేదని అన్నారు. ప్రభుత్వ తీరు రైతుల ప్రయోజనాలకు విఘాతమని, రైతులను నష్టాలకు గురిచేయడమేనని వ్యాఖ్యానించారు. దేశమంతటా రైతులు ఇప్పటివరకూ రూ 92,000 కోట్లు నగదు సాయంగా అందుకోగా, రాష్ట్రానికి ఒక రూపాయి కూడా రాలేదని గుర్తుచేశారు. బెంగాల్‌ రైతులకు జరిగిన నష్టాన్ని గుర్తించి తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రికి రాసిన లేఖలో గవర్నర్‌ కోరారు. చదవండి : కోల్‌కతాకు ఆరు ప్రాంతాల నుంచి విమానాలు బ్యాన్‌

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు