నిప్పుతో చెలగాటం వద్దు సీఎం మేడం: గవర్నర్‌

11 Dec, 2020 14:57 IST|Sakshi

ఇది నిజంగా సిగ్గుచేటు: గవర్నర్‌

కోల్‌కతా/న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై జరిగిన దాడి పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ దుమారం రేపుతోంది. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ, బీజేపీ నేతలు పరస్పరం ఆరోపణలతో మాటల యుద్ధానికి దిగుతున్నారు. తమ నాయకుడిపై దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని రాష్ట్ర బీజేపీ చీఫ్‌ దిలీప్‌ ఘోష్‌ హెచ్చరించగా.. బీజేపీ వాళ్లకు పనేమీ లేదని ఓసారి హోం మంత్రి, మరోసారి చద్దా, నద్దా, ఫద్దా లాంటి వాళ్లు ఇక్కడికి వచ్చి నాటకాలు ఆడతారంటూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘాటుగా విమర్శించారు. ఔట్‌సైడర్స్‌ కారణంగానే ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆరోపించారు. 

ఇక రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై స్పందించిన గవర్నర్‌ జగదీప్‌ ధంఖర్‌.. సీఎం మమత వ్యాఖ్యలను ఖండించారు. బాధ్యతాయుతమైన, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి ఇలా మాట్లాడటం సరికాదని విమర్శించారు. ‘మేడం.. దయచేసి కాస్త పద్ధతిగా మాట్లాడండి. మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి’ అని విజ్ఞప్తి చేశారు. ఇక ఔట్‌సైడర్స్‌ పదాన్ని ప్రస్తావిస్తూ.. ‘సీఎం మేడం.. ఇండియా ఒక్కటే. భారతీయులంతా ఒకటే. నిప్పుతో చెలగాటం ఆడవద్దు. ఇన్‌సైడర్‌, ఔట్‌సైడర్‌ అంటూ విద్వేషాలు రెచ్చగొట్టవద్దు’ అని గవర్నర్‌ హితవు పలికారు.(చదవండి: నడ్డా కాన్వాయ్‌పై రాళ్ల దాడి)

నివేదిక సమర్పించాను: గవర్నర్‌
‘జాతీయ రాజకీయ పార్టీ నాయకుడిపై నిన్న దాడి జరిగింది. కొంతమంది ఉద్దేశపూర్వకంగానే ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు కూడా వారికి సహకరించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం వంటివే ఇవన్నీ. ఇందుకు సంబంధించిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాను. నిన్న జరిగిన ఘటన అత్యంత దురదృష్టకరం. పోలీస్‌ చీఫ్‌, చీఫ్‌ సెక్రటరీకి సమన్లు జారీ చేశాను. నివేదిక ఇవ్వమని ఆదేశించాను. కానీ వారు ఎలాంటి రిపోర్టు ఇవ్వలేదు. ఇది నిజంగా సిగ్గుచేటు. ప్రభుత్వాధికారులు అయి ఉండి వారి కర్తవ్యాన్ని సరిగ్గా నెరవేర్చలేదు. ఈ పరిణామాలు నన్ను షాక్‌కు గురిచేశాయి. సిగ్గుపడేలా చేశాయి’అని గవర్నర్‌ జగ్‌దీప్‌ ధంఖర్‌ విలేకరులతో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు