బీఎంసీ తీరుపై అసహనం: కేంద్రానికి నివేదిక!

10 Sep, 2020 13:48 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ కార్యాలయాన్ని కూల్చివేసిన ఘటనలో మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కొశ్యారీ.. బృహన్ ‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ) తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ముంబైలోని పాలి హిల్‌లో గల కంగన ఆఫీస్‌ కూల్చివేతకై చేపట్టిన డ్రైవ్. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన వివాదం‌ గురించి కేంద్రానికి నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుకు గవర్నర్‌ సమన్లు జారీచేసినట్లు సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. కాగా శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌- కంగనా రనౌత్‌ మధ్య మాటల యుద్ధం ముదిరిన నేపథ్యంలో భారీ భద్రత నడుమ బాలీవుడ్‌ క్వీన్‌ బుధవారం ముంబైలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. (చదవండి: 4 రోజుల్లో ముంబైని వీడనున్న కంగన!?)

అదే సమయంలో కంగన బంగ్లాలో అక్రమ నిర్మాణాలు ఉన్నాయంటూ బీఎంసీ కూల్చివేత చర్యలు చేపట్టడం చర్చనీయాంశమైంది. బీజేపీ- శివసేన మధ్య కోల్డ్‌వార్‌కు దారి తీసిన ఈ ఘటనలో చాలా మంది నెటిజన్లు కంగన వైపే నిలబడి ఆమెకు మద్దతు ప్రకటించారు. ఇదొక కక్షపూరిత చర్య అంటూ ఠాక్రే సర్కారును విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేపై తీవ్రంగా స్పందించిన కంగనా.. ‘‘ఈరోజు నా ఇంటిని కూల్చారు. రేపు మీ అహంకారం కూలుతుంది’’ అంటూ మండిపడ్డారు.

ఇక ఈ విషయంలో కంగన ముంబై హైకోర్టును ఆశ్రయించడంతో.. ఆమెకు సంబంధించిన  బిల్డింగ్‌లో నిర్మాణాలను బీఎంసీ కూల్చివేయడాన్ని నిలిపివేస్తూ న్యాయస్థానం స్టే ఇచ్చింది. దురుద్దేశంతోనే బీఎంసీ ఈ పని చేసినట్లుందని మండిపడింది. యజమాని లేనప్పుడు కూల్చివేతలు ఎలా ప్రారంభించారని, నోటీసులకు స్పందించేందుకు కేవలం 24గంటలే సమయం ఇవ్వడమేమిటని ప్రశ్నించింది. తదుపరి విచారణను గురవారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే.  

మరిన్ని వార్తలు