అమిత్‌ షాతో తమిళిసై భేటీ.. శాంతిభద్రతలపై నివేదిక

25 Aug, 2022 01:56 IST|Sakshi

రాష్ట్రంలోని తాజా పరిణామాలపై వివరణ

ఉపరాష్ట్రపతితోనూ సమావేశమైన గవర్నర్‌ 

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ బుధవారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజ కీయ, శాంతిభద్రతల అంశంపై చర్చించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై ప్రత్యేక నివేదిక ఇచ్చినట్లు సమాచారం. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ వ్యాఖ్యల నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులు, కట్టడికి ప్రభుత్వం చేపట్టిన చర్యలను తమిళిసై వివరించినట్లుగా తెలుస్తోంది. దీంతోపాటు లిక్కర్‌ స్కామ్‌ ఆరోపణల నేపథ్యంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య జరుగుతున్న మాటల యుద్ధం, పర్యవసానంగా రెండు పార్టీల శ్రేణుల మధ్య తలెత్తిన వివాదాల అంశాన్నీ అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లినట్లుగా సమాచారం.

బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్రకు బ్రేక్, పోలీసులు వ్యవహరించిన తీరు వంటి అంశాలనూ అమిత్‌షా ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కేంద్రం దృష్టి పెట్టిందని, ఎలాంటి అల్లర్లు, ఘర్షణలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఇప్పటికే రాష్ట్ర పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లుగా అమిత్‌ షా చెప్పినట్లుగా తెలుస్తోంది. అవసరాన్ని బట్టి కేంద్ర బలగాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చినట్లుగా సమాచారం. రాష్ట్ర పరిస్థితులపై ఎప్పటికప్పుడు తమకు నివేదించాలని గవర్నర్‌కు సూచించినట్లుగా తెలుస్తోంది. అంతకుముందు భారత ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖర్‌తో గవర్నర్‌ భేటీ అయ్యారు. ఉపరాష్ట్రపతికి అభినందనలు తెలిపి, వివిధ రాజకీయ అంశాలపై చర్చించారు.

మరిన్ని వార్తలు