కొత్త ప్రైవసీ పాలసీని ఉపసంహరించుకోండి

20 May, 2021 05:54 IST|Sakshi

వాట్సాప్‌ యాజమాన్యానికి కేంద్ర ఐటీ శాఖ నోటీసు

ఏడు రోజుల్లోగా స్పందించాలని ఆదేశం

సంతృప్తికరమైన సమాధానం రాకపోతే చర్యలు

కొత్త విధానం పౌరుల హక్కులను ఉల్లంఘించేలా ఉందని ఆక్షేపణ

న్యూఢిల్లీ: వివాదాస్పదంగా మారిన నూతన ప్రైవసీ విధానం–2021ను వెనక్కి తీసుకోవాలని వాట్సాప్‌ యాజమాన్యాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌› అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) శాఖ ఆదేశించింది. ఈ మేరకు తాజాగా నోటీసు జారీ చేసింది. వాట్సాప్‌ ప్రైవసీ పాలసీలో చేసిన మార్పుల పట్ల ఐటీ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. సమాచార విధానంలోని పవిత్రమైన విలువలను, డేటా సెక్యూరిటీని, వినియోగదారుల ఎంపిక స్వేచ్ఛను దెబ్బతీసేలా ఈ నూతన పాలసీ ఉందని పేర్కొంది. కొత్త పాలసీని అమలు చేస్తున్న తీరుపై కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత పౌరుల ప్రయోజనాలను, హక్కులను ఉల్లంఘించేలా కొత్త పాలసీ ఉందని  తేల్చిచెప్పింది. నోటీసుపై ఏడు రోజుల్లోగా స్పందించాలని వాట్సాప్‌ యాజమాన్యానికి కేంద్ర ఐటీ శాఖ సూచించింది. సంతృప్తికరమైన సమాధానం రాకపోతే చట్టప్రకారం తగిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది.  

సమస్యాత్మకం, బాధ్యతారాహిత్యం
భారతదేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలు, నిబంధనలను బేఖాతరు చేస్తూ కొత్త ప్రైవసీ పాలసీని ఎలా తీసుకొచ్చారని వాట్సాప్‌ను కేంద్రం నిలదీసింది. దేశ పౌరుల హక్కులను, ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉన్న దృష్ట్యా.. భారత చట్టాల ప్రకారం వాట్సాప్‌పై చర్యలు తీసుకోవడానికి వీలున్న అన్ని అవకాశాలను పరిశీలిస్తామని తెలిపింది. ప్రైవసీ విధానం విషయంలో యూరప్‌ వినియోగదారులు, భారతీయ వినియోగదారుల మధ్య వివక్ష చూపడం ఏమిటని వాట్సాప్‌ను కేంద్రం ప్రశ్నించింది. నిత్య జీవితంలో ఎంతోమంది భారతీయులు సమాచార మార్పిడి కోసం వాట్సాప్‌పై ఆధారపడుతున్నారని గుర్తుచేసింది. దీన్ని అలుసుగా తీసుకొని భారతీయ వినియోగదారుల విషయంలో అనుచితమైన నియమ నిబంధనలు విధించడం సమస్యాత్మకమే కాదు బాధ్యతారాహిత్యం కూడా అని ఐటీ శాఖ ఉద్ఘాటించింది.

యూరప్‌ వినియోగదారుల విషయంలో ఇలాంటి అనుచిత నియమ నిబంధనలు లేవని పేర్కొంది. నూతన ప్రైవసీ పాలసీ ప్రకారం.. భారతీయ వినియోగదారుల సమాచారాన్ని వాట్సాప్‌ యాజమాన్యం తమ మాతృసంస్థ ఫేస్‌బుక్‌కు చేరవేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల వినియోగదారుల వ్యక్తిగత సమాచారం బహిరంగం కావడం తథ్యమన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొత్త ప్రైవసీ పాలసీని ఆమోదించడానికి మే 15న గడువుగా విధించిన వాట్సాప్‌ తర్వాత దాన్ని వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే తర్వాత మరో మెలిక పెట్టింది. పాలసీని ఆమోదించాల్సిందిగా కొన్నాళ్లపాటు రిమైండర్లు పంపుతామని... అప్పటికీ ఓకే చెప్పకపోతే సదరు వినియోగదారుడికి క్రమేపీ చాటింగ్, వాయిస్‌కాల్స్, వీడియో కాల్స్‌ సేవలను నిలిపివేస్తామని తమ వెబ్‌సైట్లో పేర్కొంది. అయితే దీనికి నిర్దిష్ట గడువేమీ చెప్పకపోవడం గమనార్హం. వాట్సాప్‌ కొత్త ప్రైవసీ విధానంపై ఢిల్లీ హైకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉంది.

మరిన్ని వార్తలు