ప్రతి జిల్లాలో వైద్య కళాశాల

8 Oct, 2021 06:30 IST|Sakshi

35 పీఎస్‌ఏ ఆక్సిజన్‌ ప్లాంట్ల ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ

రిషికేశ్‌: దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో కనీసం ఒక వైద్య కళాశాల ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ప్రతి రాష్ట్రంలో ఎయిమ్స్‌లను నెలకొల్పే దిశగా కృషి కొనసాగుతోందని వివరించారు. పీఎం కేర్స్‌ ఫండ్‌ కింద 35 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన 35 ప్రెషర్‌ స్వింగ్‌ అబ్సార్ప్‌షన్‌(పీఎస్‌ఏ) ఆక్సిజన్‌ ప్లాంట్లను మోదీ గురువారం ప్రారంభించారు. ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌ ‘ఎయిమ్స్‌’ ఈ కార్యక్రమానికి వేదికగా మారింది.  ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు మోదీ చెప్పారు.

ప్రభుత్వమే ప్రజల వద్దకు..
కరోనా మహమ్మారి ఉనికి తొలిసారిగా బయటపడినప్పుడు దేశంలో ఒకే ఒక్క టెస్టింగ్‌ ల్యాబ్‌ ఉండేదని, ఇప్పుడు వాటి సంఖ్య 3,000కు చేరిందని  మోదీ హర్షం వ్యక్తం చేశారు. మెడికల్‌ ఆక్సిజన్‌కు డిమాండ్‌ పెరగడంతో ఉత్పత్తిని 10 రెట్లు పెంచామన్నారు. కొత్త ప్లాంట్లతో కలిపి పీఎం కేర్స్‌ ఫండ్‌ కింద ఇప్పటిదాకా 1,150 ఆక్సిజన్‌ ప్లాంట్లు అందుబాటులోకి వచ్చినట్లు వెల్లడించారు. దేశంలో ప్రతి జిల్లాకు వీటితో సేవలు అందుతాయన్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 93 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులు ఇవ్వడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని చెప్పారు. త్వరలోనే ఈ సంఖ్య 100 కోట్ల మార్కును దాటుతుందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద, వేగవంతమైన వ్యాక్సినేషన్‌ భారత్‌లో కొనసాగుతోందని తెలిపారు. ప్రజలు వారి సమస్యల పరిష్కారం కోసం తమ వద్దకు వచ్చేదాకా ప్రభుత్వం ఎదురుచూడడం లేదని, ప్రభుత్వమే వారి వద్దకు వెళ్తోందని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఉత్తరాఖండ్‌లో ‘డబుల్‌ ఇంజన్‌’ ప్రభుత్వం అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కిస్తోందని తెలిపారు.

మరిన్ని వార్తలు