వేరే రాష్ట్రాల్లో మళ్లీ రిజిస్ట్రేషన్‌ అక్కర్లేదు !

29 Aug, 2021 04:49 IST|Sakshi

భారత్‌ సిరీస్‌ పేరిట కొత్త విధానం

కేంద్ర రవాణా శాఖ నోటిఫికేషన్‌

సాక్షి, న్యూఢిల్లీ: తమ కొత్త వ్యక్తిగత వాహనాలను ప్రభుత్వ/ప్రైవేటు ఉద్యోగులు వేరే రాష్ట్రాలకు తీసుకెళ్లినపుడు ఆ రాష్ట్రాల్లోనూ మళ్లీ రిజిస్ట్రేషన్‌ చేయాల్సిన పనిలేకుండా ‘భారత్‌ సిరీస్‌ (బీహెచ్‌–సిరీస్‌)’ పేరిట కొత్త రిజిస్ట్రేషన్‌ సిరీస్‌ను అందుబాటులోకి తేనుంది. ఈ కొత్త సిరీస్‌ సెప్టెంబర్‌ 15 నుంచి అమల్లోకి తేనుంది. ఈ వివరాలతో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయరహదారుల శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్‌ ప్రకారం కొత్త వాహనాలకు భారత్‌ సిరీస్‌ (బీహెచ్‌ –సిరీస్‌) వినియోగించనున్నారు.  వాహన యజమాని మరొక రాష్ట్రానికి బదిలీ అయినప్పటికీ ఈ రిజిస్ట్రేషన్‌ ముద్ర ఉన్న వాహనాన్ని రీ–రిజిస్ట్రేషన్‌ చేయించుకోనవసరం ఉండదని రవాణా శాఖ తెలిపింది.

కేంద్ర భద్రతా బలగాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, నాలుగుకంటే ఎక్కువ రాష్రాల్లో కార్యాలయాలున్న ప్రైవేట్‌ సంస్థల ఉద్యోగులు వేరే రాష్ట్రాలకు బదిలీ అయినపుడు  ఈ రిజిస్ట్రేషన్‌ సౌకర్యాన్ని వాడుకోవచ్చని పేర్కొంది. బీహెచ్‌–సిరీస్‌ రిజిస్ట్రేషన్‌ మార్క్‌ ఉన్న వాటి వాహనాల పన్ను ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో చెల్లించాలి.
మోటారు వాహనం పన్నును రెండేళ్లు, అంత కుపైన విధించనున్నారు. 14 ఏళ్లు పూర్తవగానే ఆ వాహనంపై ఏటా విధించే పన్ను అంతకు ముందు విధించిన మొత్తంలో సగానికి తగ్గించనున్నారు. అదేవిధంగా, కొత్త సిరీస్‌ ఉన్న నాన్‌–ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాల ధర రూ. 10 లక్షల లోపు ఉంటే 8% వాహన పన్ను, రూ. 10–20 లక్షల మధ్య ఉంటే 10% పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

రిజిస్ట్రేషన్‌ ముద్ర ఫార్మాట్‌
YY BH ####  XX. ఇందులో వైవై అంటే తొలి రిజిస్ట్రేషన్‌ సంవత్సరం, బీహెచ్‌ అంటే భారత్‌ సిరీస్‌ కోడ్, #### అంటే 0000 నుంచి 9999 నంబర్లు.. ఎక్స్‌ఎక్స్‌ అంటే ఆంగ్ల అక్షర క్రమం.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు