కరోనాతో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఆసరా

31 May, 2021 00:29 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మృతుల సంఖ్య పెరగడంతో ఉద్యోగుల్లో ఏర్పడిన భయాందోళనలు తొలగించేందుకు, ఆర్జిస్తున్న ఇంటిపెద్దను కోల్పోయిన కుటుంబాలకు ఆసరాగా కేంద్ర ప్రభుత్వం పెన్షన్‌ను ప్రకటించింది. కార్మిక రాజ్యబీమా సంస్థ (ఈఎస్‌ఐసీ), ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)ల ద్వారా కార్మికులకు అదనపు ప్రయోజనాలను ఇస్తున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ ఆదివారం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా... ఎవరెవరు అర్హులో వివరిస్తూ మార్గదర్శకాలు జారీచేసింది. ఉద్యోగికి కోవిడ్‌ వ్యాధి నిర్ధారణ కావడానికి ముందే ఈఎస్‌ఐసీ ఆన్‌లైన్‌ పోర్టల్‌లో పేర్లు నమోదైన ఉద్యోగి కుటుంబ సభ్యులందరికీ ప్రయోజనాలు వర్తింపజేయాలని నిర్ణయించింది.

‘బీమా సభ్యత్వం ఉన్న వ్యక్తి తనకు కోవిడ్‌ నిర్ధారణ జరగడానికి కనీసం మూడు నెలలు ముందుగా ఈఎస్‌ఐసీ ఆన్‌లైన్‌ పోర్టల్‌లో  పేరు నమోదు చేసుకుని ఉండాలి. బీమా సభ్యత్వం ఉన్న వ్యక్తి తనకు కోవిడ్‌ నిర్ధారణ జరిగిన సంవత్సరానికి మునుపటి ఏడాదిలో నియమితుడై ఉండి, తన వేతనం నుంచి కనీసం 78 రోజుల పాటు ఈఎస్‌ఐసీ చందా చెల్లించి ఉండాలి’ అని పేర్కొంది. ఈ అర్హతలన్నీ ఉన్న ఉద్యోగులు కోవిడ్‌ వ్యాధితో మరణించిన పక్షంలో సదరు వ్యక్తులపై ఆధారపడిన వారికి, సంబంధిత ఉద్యోగి దినసరి వేతనంలో 90 శాతం చొప్పున మొత్తం నెలవారీగా పెన్షన్‌ను చెల్లిస్తారు. ఇది జీవితాంతం అందుతుంది. ఈ పథకం గతేడాది మార్చి 24 నుంచి రెండేళ్ల పాటు అమలులో ఉంటుందని పేర్కొంది. 


►ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఆధ్వర్యంలోని డిపాజిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ (ఈడీఎల్‌ఐ) పథకంలోనూ కొన్ని మార్పులు చేసింది.   
►మరణించిన ఉద్యోగికి సంబంధించిన కుటుంబ సభ్యులకు చెల్లించే గరిష్ట మొత్తాన్ని రూ. 6 లక్షల నుంచి 7 లక్షలకు పెంచారు. 
►కనీసం 12 నెలలపాటు ఒకే సంస్థలో కొనసాగుతూ ఈఎస్‌ఐ చందా చెల్లించాలనే నిబంధనను సడలించారు. ఏడాదికాలంలో ఒకటికి మించి సంస్థల్లో పనిచేసినా.. 2.5 లక్షల కనీస హామీ ప్రయోజనం లభిస్తుంది.  
►కనీస హామీ ప్రయోజన రూపంలో చెల్లించే రూ. 2.5 లక్షల పరిహారానికి సంబంధించిన నిబంధనను గతేడాది ఫిబ్రవరి 15 నుంచి అమలులోకి వచ్చేలా పునరుద్ధరణ.   

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు