ఫిబ్రవరి 2న పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు

31 Jan, 2023 02:53 IST|Sakshi

రేపు బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్న ఆర్థిక మంత్రి సీతారామన్‌

తొలి విడత ఫిబ్రవరి 14 వరకు.. రెండో విడత మార్చి 12 నుంచి ఏప్రిల్‌ 6 వరకు నిర్వహ

అన్ని పార్టీల సహకారం కోరిన కేంద్రం

రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించనున్న బీఆర్‌ఎస్, ఆప్‌

సాక్షి, న్యూఢిల్లీ: వాడీవేడీ చర్చలకు వేదికగా నిలిచే పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉభయ సభలనుద్దేశించి ప్రారంభోపన్యాసం చేయనున్నారు. రాష్ట్రపతిగా ఉభయసభలనుద్దేశిస్తూ ఆమె చేస్తున్న తొలి ప్రసంగం ఇది. ఆ తర్వాత సామాజిక, ఆర్థిక సర్వే నివేదికను పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. బుధవారం ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో 2023–24 బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.

ఫిబ్రవరి 2న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. రాజ్యసభ, లోక్‌సభలో దీనిపై ప్రధాని మోదీ సమాధానం ఇవ్వనున్నారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని పాత పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లోనే నిర్వహిస్తామని లోక్‌సభ స్పీకర్‌ బిర్లా గతంలో ప్రకటించారు. ఈసారి సమావేశాలు రెండు విడతల్లో జరగనున్నాయి. తొలి విడత ఫిబ్రవరి 14 వరకు, ఆ తర్వాతి విడత మార్చి 12న మొదలై ఏప్రిల్‌ ఆరో తేదీన పూర్తికానుంది.

ప్రధాన సమస్యలపై నిలదీత!
2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు మోదీ ప్రభుత్వం ఓ వైపు సన్నాహాలు చేస్తుండగా, మరోవైపు కేంద్రాన్ని నిలదీసేందుకు విపక్షాలు కత్తులు నూరుతున్నాయి. పెరిగిన ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, తాజా ఆర్థిక పరిస్థితి, సన్నగిల్లిన కేంద్ర–రాష్ట్ర సంబంధాలు, పెరిగిన చైనా సరిహద్దు వివాదం, బీజేపీయేతర పార్టీల పాలిత రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల్లో గవర్నర్ల జోక్యం, గౌతమ్‌ అదానీ షేర్లపై హిండెన్‌బర్గ్‌ సంచలనాత్మక నివేదిక, జాతీయస్థాయి కుల గణన, మహిళా రిజర్వేషన్‌ బిల్లు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని కడిగి పారేయాలని విపక్షాలు నిర్ణయించాయి.

రాష్ట్రపతి ప్రసంగాన్ని కొన్ని పార్టీలు ‘బాయ్‌కాట్‌’ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. గవర్నర్‌ వ్యవస్థపై బీఆర్‌ఎస్‌ సహా డీఎంకే, టీఎంసీ గట్టిగా పోరాడాలని నిర్ణయించుకోగా నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలపై సీపీఐ, సీపీఎం ప్రభుత్వాన్ని నిలదీయనున్నాయి. చైనా సరిహద్దు వివాదాలు, రూపాయి పతనం, బడా కార్పొరేట్‌ కంపెనీల దోపిడీపై కాంగ్రెస్‌ పార్టీ మోదీ సర్కార్‌ను ఇరకాటంలో పెట్టేలా వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. ఈసారి బడ్జెట్‌ సెషన్‌ మొత్తం 27 సిట్టింగ్‌లలో ఉండనుంది. ఈ సారి సమావేశాల్లో 36 బిల్లులు పార్లమెంట్‌ ముందుకు రానున్నాయి.

అఖిలపక్ష భేటీకి కాంగ్రెస్‌ డుమ్మా
మంగళవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలకు ముందు కేంద్ర ప్రభుత్వం సోమవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. రక్షణ మంత్రి రాజ్‌నా«థ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషీ, మంత్రులు పీయూశ్‌ గోయల్, అర్జున్‌ రామ్‌ మేఘవాల్, మురళీధరన్‌ ఆధ్వర్యంలో జరిగిన భేటీకి ఆర్జేడీ, జేడీయూ, బీఆర్‌ఎస్, వైఎస్సార్‌సీపీ, డీఎంకే, నేషనల్‌ కాన్ఫరెన్స్, టీఎంసీ, శివసేన, బీజేడీ తదితర 27 పార్టీల తరఫున 37 మంది నేతలు హాజరయ్యారు.

సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రభుత్వానికి విపక్షాలు సహకరించాలని మంత్రులు కోరారు. దేశం ఎదుర్కొంటున్న కీలక సమస్యలతో పాటు రాష్ట్రాల పరిధిలో పెండింగ్‌లో ఉన్న అంశాలపై చర్చించాల్సిందేనని విపక్షాల నేతలు డిమాండ్‌చేశారు. ఈ భేటీకి కాంగ్రెస్‌ దూరంగా ఉంది. ఆ పార్టీ లోక్‌సభ, రాజ్యసభా పక్ష నేతలు అధిర్‌ రంజన్‌ చౌదరీ, మల్లికార్జున ఖర్గే కశ్మీర్‌లో భారత్‌ జోడో యాత్ర ముగింపు సభలో పాల్గొనేందుకు వెళ్లడంతో భేటీకి హాజరు కాలేదు. మంగళవారం కాంగ్రెస్‌ పక్షనేతలు తనను కలసి తమ అభిప్రాయాలు పంచుకుంటారని మంత్రి ప్రహ్లాద్‌ జోషి చెప్పారు.

తృణధాన్యాలతో వంటకాలు
పార్లమెంట్‌ క్యాంటీన్‌లో ఈసారి తృణధాన్యాలతో చేసిన వంటకాలు ఎంపీలకు కొత్త రుచులను అందివ్వనున్నాయి. రాగులు, జొన్నలు, సజ్జలు, అరికెలు, సామలు ఇలా పలు రకాల చిరుధాన్యాలతో వండిన ఆహార పదార్థాలు ఎంపీలు, సిబ్బంది, సందర్శకులకు క్యాంటీన్‌లో అందుబాటులో ఉంచుతారు. 

మరిన్ని వార్తలు