మంకీపాక్స్‌పై మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం

31 May, 2022 21:25 IST|Sakshi

న్యూఢిల్లీ: మంకీపాక్స్‌పై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. భారత్‌లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలిపింది. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా కేంద్రం చర్యలు చేపట్టింది. అనుమానిత కేసుల శాంపిళ్లను పూణేలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపాలని సూచించింది.

గత 21 రోజులలో మంకీపాక్స్‌ సోకిన దేశాలకు ప్రయాణించిన చరిత్ర ఉన్న ఏ వయస్సు వారైనా, తీవ్రమైన దద్దుర్లు, వాపు, జ్వరం, తలనొప్పి, శరీర నొప్పులు, తీవ్రమైన బలహీనత వంటి ఇతర లక్షణాలు కలిగి ఉంటే మంకీపాక్స్ వైరస్ వ్యాధితో బాధపడుతున్నట్లు అనుమానిస్తున్నారు. వీరికి కొద్ది రోజులు దూరంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

ఇదిలాఉంటే, మంకీపాక్స్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్యల గణనీయంగా పెరుగుతోంది. ప్రజారోగ్యానికి మంకీపాక్స్‌ ముప్పు పొంచి ఉన్నదని డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా వైరస్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని, ఇప్పటివరకు 23 దేశాల్లో 257 కేసులు నమోదు అయినట్టు పేర్కొంది. మరో 120 మందిలో లక్షణాలను గుర్తించామని వెల్లడించింది. కొన్ని దేశాల్లో బయటపడిన మంకీపాక్స్‌ వేగంగా వ్యాప్తిచెందుతున్నదని స్పష్టం చేసింది.

చదవండి: (కారులో వెళ్తున్న ప్రధాని మోదీ.. యువతి చేతిలో ఆ ఫోటో చూడగానే..)

మరిన్ని వార్తలు