డీఏపీపై సబ్సిడీ పెంపునకు కేంద్రం కేబినెట్‌ ఆమోదం

17 Jun, 2021 04:38 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:   డీఏపీ (డై అమోనియం ఫాస్ఫేట్‌) బస్తా పాత ధరకే లభించనుంది. డీఏపీ బస్తాకు రూ.700 చొప్పున సబ్సిడీని పెంచుతూ గత నెలలో ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన అత్యున్నత సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని బుధవారం కేంద్ర కేబినెట్‌ ఆమోదించింది.  గత ఏడాది డీఏపీ బస్తా ధర రూ. 1,700 ఉండగా, కేంద్రం రూ. 500 సబ్సిడీ ఇవ్వడంతో కంపెనీలు రూ. 1,200కు బస్తా చొప్పున విక్రయించాయి. అంతర్జాతీయంగా ధరల పెరుగుదల కారణంగా డీఏపీ బస్తా రూ. 2,400 లకు చేరుకుంది. రైతులకు పాత ధరకే డీఏపీ బస్తా లభించేలా కేంద్రం తాజాగా సబ్సిడీని రూ. 1,200లకు పెంచింది.   

డీప్‌ ఓషియన్‌ మిషన్‌కు ఓకే
సముద్ర వనరుల సుస్థిర వినియోగానికి వీలుగా రానున్న ఐదేళ్లలో రూ. 4,077 కోట్లు వెచ్చించేందుకు కేంద్ర భూశాస్త్ర మంత్రిత్వ శాఖ చేసిన ప్రతిపాదన అయిన ‘డీప్‌ ఓషియన్‌ మిషన్‌’కు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆమోదం తెలిపింది.   ఈ మిషన్‌ ప్రధానంగా ఆరు భాగాలుగా ఉంటుంది. డీప్‌ సీ మైనింగ్‌లో భాగంగా సముద్రంలో 6 వేల మీటర్ల అడుగున ఖనిజాల అన్వేషణకు వీలుగా శాస్త్రీయ సెన్సార్లు, పరికరాల సహితంగా ముగ్గురు మనుషులను తీసుకెళ్లగలిగే ఒక సబ్‌మెర్సిబుల్‌ను అభివృద్ధి చేస్తారు. ఇప్పటివరకు కొన్ని దేశాలకు మాత్రమే ఇలాంటి సామర్థ్యం ఉంది.  

ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ విభజన
ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డును కేంద్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీని ఏడు ప్రభుత్వరంగ సంస్థలుగా విభజించింది. కేబినెట్‌ దీనికి బుధవారం ఆమోదముద్ర వేసింది. జవాబుదారీతనం, పోటీతత్వం, పనితీరును మెరుగుపర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దేశంలోని 41 ఆయుధ కర్మాగారాలు, సైనిక ఉత్పత్తుల సంస్థలు ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ కింద ఉన్నాయి.

మరిన్ని వార్తలు