ఆత్మనిర్భర్‌ 2.0

25 May, 2021 15:17 IST|Sakshi

ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న కేంద్రం 

ఆర్థికవేత్తలతో మంంత్రి నిర్మలా సీతారామన్‌​ భేటీ

న్యూఢిల్లీ : దేశంలో రెండోసారి విధించిన లాక్‌డౌన్‌తో మందగించిన ఆర్థిక వ్యవస్థను గాడిపెట్టేందుకు మరోసారి ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ , ఆత్మనిర్భర్‌ 2ని ప్రకటించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఆర్థికవేత్తలతో మంత్రి నిర్మలా సీతారామన్‌ భేటీ అవుతున్నారు. ప్యాకేజీ ఎలా ఉండాలి, ఏ రంగాలను ఏ విధంగా ఆదుకోవాలనే అంశాలనే ఈ సమావేశాల్లో చర్చిస్తున్నట్టు జాతీయ మీడియా పేర్కొంది. ప్యాకేజీ ప్రకటించే విషయంపై ఢిల్లీలో తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నది వాస్తవమే అయినా .. ఆత్మనిర్భర్‌ 2 ఎప్పుడు కార్యరూపం దాల్చుతుందనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. 

మూడు రంగాలపై ఫోకస్‌
ఈసారి లాక్‌డౌన్‌ కారణంగా ఏవియేషన్‌, టూరిజం, ఆతిధ్యరంగాలు తీవ్రంగా నష్టపోయినట్టు ప్రభుత్వం భావిస్తోంది. ఈ రంగాలను ఆత్మనిర్భర్‌ 2 ద్వారా ఆదుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించారు. వీటితో పాటు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు సైతం తీవ్రంగా నష్టపోయాయని, వీటికి సైతం ఆర్థిక సహకారం అందివ్వాలని నిర్ణయించారు. రుణాల చెల్లింపుల విషయంలో వాణిజ్య, పారిశ్రామిక రంగానికి కొంత వెసులుబాటు ఇవ్వాలని బ్యాంకులకు ఆర్బీఐ ఇప్పటికే సూచించింది. 

ఇప్పుడే కాదు
గతేడాది లాక్‌డౌన్‌, అన్‌లాక్‌ ప్రక్రియలను పూర్తిగా కేంద్రమే చేపట్టింది. ఈసారి లాక్‌డౌన్‌ విధింపు అంశాన్ని రాష్ట్రాలకే వదిలేసింది. ఒక్కో రాష్ట్రం ఒక్కో సమయంలో లాక్‌డౌన్‌ విధించింది. కరోనా విలయం అదుపులోకి వచ్చి రాష్ట్రాలన్నీ లాన్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత... జరిగిన నష్టాన్ని అంచనా వేసి అప్పుడు ఆత్మనిర్భర్‌ 2 ప్యాకేజీని ప్రకటిస్తారని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి.

మరిన్ని వార్తలు