లక్ష ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు, ఆక్సిజన్‌ ప్లాంట్లు

29 Apr, 2021 05:34 IST|Sakshi

పీఎం కేర్స్‌ ఫండ్స్‌తో ఏర్పాటు: ప్రధాని

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కట్టడిలో పూర్తిగా నిమగ్నమైన కేంద్ర ప్రభుత్వానికి పీఎం కేర్స్‌ ఫండ్‌ సాయపడనుంది. పీఎం కేర్స్‌ ఫండ్‌ నిధులను వినియోగించుకుని లక్షల పోర్టబుల్‌ ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను సమీకరించడంతోపాటు 500కుపైగా ప్రెషర్‌ స్వింగ్‌ అడ్సార్ప్‌షన్‌ ఆక్సిజన్‌ (పీఎస్‌ఏ) ప్లాంట్లను నెలకొల్పుతామని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం వెల్లడించారు. ఇలా అదనపు ఆక్సిజన్‌ అందుబాటులోకి రావడంతో జిల్లా కేంద్రాలు, టైర్‌–2 నగరాల్లో కోవిడ్‌ బాధితులకు ఆక్సిజన్‌ అవసరాలు కొంతమేర తీరతాయని ప్రధాని మోదీ చెప్పారు.

డిమాండ్‌ ఎక్కువగా ఉన్న క్లస్టర్ల వద్ద ఆక్సిజన్‌ సరఫరాను మెరుగైన స్థాయిలో పెంచడానికి ఇవి ఎంతగానో దోహదపడతాయని ప్రధాని కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ‘డిమాండ్‌ ఉన్న క్లస్టర్ల వద్దే ప్లాంట్లను ఏర్పాటుచేయడం ద్వారా.. ప్రస్తుత ప్లాంట్ల నుంచి ఆస్పత్రులకు ఆక్సిజన్‌ సరఫరా సమస్యలను అధిగమించ వచ్చు. కొత్త ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన దేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని డీఆర్‌డీఓ, సీఎస్‌ఐఆర్‌లు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.

ఈ టెక్నాలజీని స్థానిక సంస్థలకు అందివ్వనున్నాయి’అని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. కోవిడ్‌–19 నిర్వహణ వ్యవస్థలో లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ సరఫరా తీరుతెన్నులపై ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయిలో సమావేశంలో కొత్త ప్లాంట్ల ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారు. వీలైనంత తొందరగా ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను కొనుగోలుచేసి విపరీతమైన పాజిటివ కేసులతో సతమతమవుతున్న రాష్ట్రాలకు పంపించాలని మోదీ ఆదేశించారు.  

నిరంతర సాయానికి వాయుసేన సిద్ధం
కోవిడ్‌ సంబంధ కేంద్ర ప్రభుత్వ సహాయక చర్యల్లో  నిరంతరాయంగా సాయపడేందుకు భారత వాయుసేన సిద్దంగా ఉందని ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌కేఎస్‌ భదౌరియా చెప్పారు. ప్రభుత్వానికి తోడ్పాటుపై జరిగిన సమీక్ష సమావేశంలో ప్రధాని మోదీకి భదౌరియా వివరాలు వెల్లడించారు. భారీ స్థాయిలో యుద్ధ సరకులను తరలించే వాయుసేన రవాణా విమానాలను కేంద్రప్రభుత్వానికి అందుబాటులో ఉంచుతామని భదౌరియా స్పష్టంచేశారు.

మరిన్ని వార్తలు