కోవిడ్‌తో కన్నవారిని కోల్పోయిన చిన్నారులు

18 May, 2021 08:34 IST|Sakshi

పునరావాసం పై స్పష్టతనిచ్చిన కేంద్రం

న్యూఢిల్లీ: కోవిడ్‌–19తో కన్నవారిని వారిని పోగొట్టుకున్న చిన్నారుల పునరావాసం విధానాన్ని కేంద్రం ఖరారు చేసింది. కోవిడ్‌ మహమ్మారికి బలైపోయిన తల్లిదండ్రుల పిల్లలను దత్తత తీసుకుంటామంటూ పలువురు సామాజిక మాధ్య మాల ద్వారా ముందుకు వస్తున్న నేపథ్యంలో కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ (డబ్ల్యూసీడీ) ఈ మేరకు స్పందించింది. ఇలా దత్తత తీసుకోవడం లేదా ప్రోత్సహించడం చట్ట వ్యతిరేకమని పేర్కొంటూ ఈ విషయంలో నిర్దిష్ట విధానాన్ని ప్రకటించింది. ‘కోవిడ్‌–19కు గురై తల్లి, తండ్రి ఇద్దరూ చనిపోయిన సందర్భాల్లో వారి సంతానాన్ని స్థానిక సిబ్బంది జిల్లా శిశు సంక్షేమ కమిటీ (సీడబ్ల్యూసీ) ఎదుట 24 గంటల్లోగా హాజరు పరచాలి. ఆ వెంటనే సీడబ్ల్యూసీలు సదరు చిన్నారిని.. పరిస్థితిని బట్టి సంరక్షకులకు అప్పగించడం లేదా ఇతర సంస్థల్లో పునరావాసం కల్పించేందుకు తగు ఉత్తర్వులు జారీ చేయాలి’అని డబ్ల్యూసీడీ పేర్కొంది.

ఆ చిన్నారి భద్రత, వారి ఆసక్తిని పరిగణనలోకి తీసుకుంటూ సాధ్యమైనంత వరకు వారి కుటుంబం, సామాజిక వర్గం వాతావరణంలో ఇమిడేలా జువెనైల్‌ జస్టిస్‌ చట్టం ప్రకారం జాగ్రత్తలు తీసుకోవాలంది. బంధువర్గంలోని వారి సంరక్షణలో ఉంచినట్లయితే ఆ చిన్నారి యోగక్షేమాలను సమీక్షిస్తుండాలని కోరింది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాలు ఈ అంశాలను వర్చువల్‌గా జిల్లా యంత్రాంగాలకు తెలపాలని సూచించింది. ఎవరైనా చిన్నారి కోవిడ్‌తో తన తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన సందర్భాల్లో ఆ సమాచారాన్ని చైల్డ్‌ లైన్‌ నంబర్‌ 1098కి ఫోన్‌ చేసి తెలపవచ్చని పేర్కొంది. అనాథ చిన్నారులను చట్టపరంగా దత్తత తీసుకోదలిచిన వారు సెంట్రల్‌ అడాప్షన్‌ రిసోర్స్‌ అథారిటీ (cara.nic.in)ని సంప్రదించాలని కోరింది.

(చదవండి: పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు