హోం ఐసోలేషన్‌లో ఉన్నారా? ఈ గైడ్‌లైన్స్‌ తెలుసుకోండి

30 Apr, 2021 06:23 IST|Sakshi

సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసిన హోం శాఖ

న్యూఢిల్లీ: కరోనా స్వల్ప లక్షణాలు కనిపించేవారు లేదా ఎసింప్టమాటిక్‌ (కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చినా, ఎలాంటి లక్షణాలు చూపనివారు) పేషెంట్ల హోం ఐసోలేషన్‌కు సంబంధించి కేంద్ర హోం శాఖ సవరించిన గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది. ఇంట్లో ఐసోలేషన్‌ గడుపుతున్నవారు రెమ్‌డేసివిర్‌ తీసుకోవద్దని, ఈ ఇంజక్షన్‌ను ఆస్పత్రుల్లోనే ఇవ్వాలంది.  సిస్టమిక్‌ ఓరల్‌ స్టిరాయిడ్స్‌ను స్వల్ప లక్షణాలున్న కేసుల్లో వాడవద్దని, లక్షణాలు ఏడు రోజులకు మించి ఉంటేనే డాక్టర్‌ సూచన మేరకు తీసుకోవాలని వెల్లడించింది.  

సవరించిన నిబంధనలివే..
► 60 సంవత్సరాలు పైబడిన లేదా బీపీ, షుగర్, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ వ్యాధులతో బాధపడే పేషెంట్లను మెడికల్‌ అధికారి పరిశీలించాకే హోం ఐసోలేషన్‌కు అనుమతిస్తారు.  

► హోం ఐసోలేషన్‌లో ఉన్న పేషెంట్ల ఆక్సిజన్‌ స్థాయిలు తగ్గినా, ఊపిరి తీసుకోవడంలో సమస్యలు తలెత్తినా డాక్టర్‌ను సంప్రదించి వెంటనే ఆస్పత్రిలో చేర్చాలి.  

► గృహ స్వీయ నిర్భంధంలో ఉన్న పేషెంట్లు రోజుకు రెండుసార్లు ఉప్పునీళ్లతో పుక్కిలించడం, రెండుమార్లు ఆవిరి పట్టడం చేయాలి.  

► రోజుకు నాలుగుమార్లు 650 ఎంజీ పారాసిటమాల్‌ మాత్రలు ఇచ్చినా జ్వరం తగ్గకుంటే వైద్యుడిని సంప్రదించి నాన్‌ స్టిరాయిడల్‌ యాంటి ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్‌ని వాడవచ్చు.

► ఐవర్‌మెక్టిన్‌ మాత్రను పరిగడుపున 3–5 రోజుల పాటు వాడే విషయాన్ని పరిగణించవచ్చు.

► ఆక్సిజన్‌ స్థాయిలు 94 శాతం పైన ఉండి, ఎలాంటి లక్షణాలు చూపకపోయినా, టెస్టుల్లో పాజిటివ్‌ వచ్చినవారిని ఎసింప్టమాటిక్‌ అని, స్వల్ప లక్షణాలు చూపుతూ, ఆక్సిజన్‌ స్థాయిలు 94 శాతంపైచిలుకు ఉన్నవారిని స్వల్పలక్షణాలున్నవారని గుర్తిస్తారు.
 
► వ్యాధిగ్రస్తుడి కేర్‌టేకర్లు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ప్రొఫైలాక్సిస్‌ను డాక్టర్‌ సలహా తీసుకోవాలి. ఎన్‌–95 మాస్క్‌ను ధరించాలి

► ఐసోలేషన్‌ గదిలోకి గాలి వెలుతురు బాగా వచ్చేలా ఏర్పాటు చేసుకొని, ట్రిపుల్‌ లేయర్‌ మెడికల్‌ మాస్కును ధరిస్తూ ఉండాలి. 8 గంటల తర్వాత మాస్కు మారుస్తుండాలి.  

► రోగనిరోధకత తక్కువగా ఉన్న పేషెంట్లకు హోం ఐసోలేషన్‌ పనికిరాదు.  

► సుమారు పదిరోజులు పైబడి ఐసోలేషన్‌లో ఉన్నవారు లక్షణాలు తగ్గగానే(మూడురోజుల పాటు జ్వరం రాకుండా ఉండడం లాంటివి) డిశ్చార్జ్‌ కావచ్చు. హోం ఐసోలేషన్‌ పూర్తి చేసుకొని, లక్షణాలు కనిపించని వారు తిరిగి కోవిడ్‌ టెస్ట్‌ చేయించుకోవాల్సిన అవసరం లేదు.  

అధిక కేసులున్న జిల్లాల్లో కఠిన ఆంక్షలు
రాష్ట్రాలకు సూచించిన హోం శాఖ
కేసులు విపరీతంగా పెరిగిపోతున్న జిల్లాల్లో కంటైన్మెంట్‌ ఆంక్షలను కఠినతరం చేయాలని ఆయా రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ గురువారం సూచించింది. కోవిడ్‌ పాజిటివిటీ రేటు 10శాతం కంటే ఎక్కువగా ఉన్న జిల్లాలు, గత వారం రోజుల్లో 60శాతానికిపైగా పడకల ఆక్యుపెన్సీ ఉన్న జిల్లాలో కొత్త కంటైన్మెంట్‌ ఆంక్షలను అమలుచేయాలని సూచించింది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలు విడుదలచేసింది. మే నెలలో దేశంలో కోవిడ్‌ తీవ్రత ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ పెట్టేదీ లేనిదీ తాజా మార్గదర్శకాల్లో ఎక్కడా పేర్కొనలేదు.

మరిన్ని వార్తలు