ఉక్రెయిన్‌ విద్యార్థులకు దేశీయంగా సీట్లు కల్పించలేం

16 Sep, 2022 03:31 IST|Sakshi

సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిన కేంద్రం

సాక్షి, న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులకు దేశీయ కళాశాలల్లో ప్రవేశాలు కల్పించలేమని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌ కళాశాలల అనుమతితో మరో దేశంలో వైద్య విద్య పూర్తి చేయడానికి అవకాశం కల్పిస్తామని తెలిపింది. ఈ మేరకు గురువారం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు విచారించింది. ఉక్రెయిన్‌ నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులను దేశీయ కళాశాలల్లో ప్రవేశం కల్పించడం చట్టపరంగా సాధ్యం కాదని అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొంది.

‘నీట్‌లో తక్కువ మార్కులు రావడంతోనే వారంతా ఉక్రెయిన్‌ వెళ్లారు. నీట్‌లో తక్కువ మెరిట్‌ ఉన్న వీరికి ఇక్కడ ప్రవేశాలు కల్పిస్తే ఆయా కాలేజీల్లో సీట్లు పొందలేకపోయిన అభ్యర్థుల నుంచి పిటిషన్లు వెల్లువెత్తే ప్రమాదముంది. ఉక్రెయిన్‌ యుద్ధంతో కోర్స్‌ పూర్తి చేయలేని విద్యార్థుల కోసం సెప్టెంబరు ఆరున నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ జారీ చేసిన పబ్లిక్‌ నోటీస్‌తో మాకు అభ్యంతరం లేదు. అయితే ఆ నోటీసు వీరికి ఇక్కడి కాలేజీల్లో బ్యాక్‌ డోర్‌ ఎంట్రీగా భావించరాదు’ అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘తిరిగొచ్చిన విద్యార్థుల్ని దేశీయ మెడికల్‌ కాలేజీలకు బదిలీ చేస్తే దేశంలో వైద్య విద్య ప్రమాణాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది’ అని కేంద్రం పేర్కొంది.

ఉక్రెయిన్‌ నుంచి వచ్చిన వైద్య విద్యార్థులు అకడమిక్‌ మొబిలిటీ ప్రోగ్రామ్‌ కింద ఏయే దేశాల్లోని యూనివర్సిటీల్లో వైద్య విద్య పూర్తి చేయొచ్చో తెలిపే జాబితాను గురువారం నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ విడుదల చేసింది. అమెరికా, ఇటలీ, స్పెయిన్, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, లిథువేనియా, పోలండ్, స్వీడన్, ఈజిప్టు, ఇజ్రాయెల్, గ్రీస్, ఇరాన్, చెక్‌ రిపబ్లిక్, జార్జియా, కజకిస్తాన్, స్లోవేకియా, హంగేరీ, ఉజ్బెకిస్తాన్, బెలారస్, లాత్వియాల్లో వైద్య విద్య పూర్తి చేయొచ్చని తెలిపింది.

ఇదీ చదవండి: సర్వం అధినాయకత్వం కనుసన్నల్లోనే!

>
మరిన్ని వార్తలు