టోల్‌గేట్‌ వద్ద 'ది గ్రేట్‌ ఖలీ' హల్‌చల్‌.. సిబ్బందిపై పంచ్‌లు! 

12 Jul, 2022 19:40 IST|Sakshi

చండీగఢ్‌: డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌ స్టార్‌, ప్రముఖ భారత రెజ్లర్‌ ది గ్రేట్‌ ఖలీ(49) అలియాస్‌ దలీప్‌ సింగ్‌ రాణా మరోమారు వార్తల్లో నిలిచారు. పంజాబ్‌, లుధియానాలోని ఓ టోల్‌గేట్‌ వద్ద సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. టోల్‌ కార్మికుడిపై ఖలీ చేయి చేసుకున్నాడని అక్కడి సిబ్బంది ఆరోపించారు. టోల్‌గేట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన ఖలీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే.. ఆ వీడియోలో టోల్‌ సిబ్బందిపై చేయి చేసుకున్నట్లు ఎక్కడా కనిపించలేదు. 

మరోవైపు.. లాధోవాల్‌ టోల్‌ ప్లాజా సిబ్బంది తనను బ్లాక్‌మెయిల్‌ చేశారని ఆరోపించారు దలిప్‌ సింగ్‌ రాణా. ఈ సంఘటన సోమవారం జరిగిందని పోలీసులు తెలిపారు. పంజాబ్‌లోని జలంధర్‌ నుంచి హరియాణాలోని కర్నాల్‌కు ఖలీ తన కారులో వెళ్తున్న క్రమంలో టోల్‌గేట్‌ వద్ద ఈ సంఘటన ఎదురైనట్లు చెప్పారు. ధ్రువీకరణ పత్రం అడిగిన తమ సిబ్బందిని ఎందుకు కొట్టారని ఖలీని టోల్‌ సిబ్బంది అడుగుతున్నట్లు ఆ వీడియోలో స్పష్టమవుతోంది. 'మిమ్మల్ని ఐడీకార్డు చూపించాలని అడిగారు. ఐడీ చూపించండి' అని టోల్‌ సిబ్బంది అడగగా.. మీరు నన్ను బ్లాక్‌మెయిలింగ్‌ చేస్తున్నారా? అంటూ ప్రశ్నించారు ఖలీ. దానికి 'మిమ్మల్ని మేము బ్లాక్‌మెయిల్ చేయటం లేదు.. అతడిని ఎందుకు కొట్టారు? మీ దగ్గర ఉంటే ఐడీ చూపించండి' అని టోల్‌ సిబ్బంది సమాధానమిచ్చారు. అయితే.. తన వద్ద ఎలాంటి ఐడీ కార్డు లేదని ఖలీ వారితో చెప్పారు. 

ది గ్రేట్‌ ఖలీ వాహనం టోల్‌గేట్‌ దాటి వెళ్లకుండా ముందు బారికేడ్‌ పెట్టారు అక్కడి సిబ్బంది. దీంతో కోపంతో ఊగిపోయిన ఖలీ దానిని తీసి పక్కన పడేశారు. టోల్‌ సిబ్బంది ఖలీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు కలుగజేసుకుని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఇరువురు తమ వాదనలు పోలీసులకు వినిపించారు. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌ అయిన క్రమంలో వివరణ ఇచ్చారు ఖలీ. 'నిన్న పంజాబ్‌లోని లాధోవాల్‌ టోల్‌ప్లాజా వద్ద సిబ్బంది నా కారును అడ్డుకుని సెల్ఫీ కోసం నాతో అసభ్యంగా ప్రవర్తించారు. నేను అందుకు అంగీకరించకపోవటం వల్ల జాతివిద్వేష వ్యాఖ్యలు చేశారు. అలాగే కొన్ని బూతులు మాట్లాడారు.' అని ఖలీ చెప్పారు.


ఇదీ చూడండి: దిల్లీ- ముంబైల మధ్య 'ఎలక్ట్రిక్‌ హైవే'.. దేశంలోనే తొలిసారి!

మరిన్ని వార్తలు