Karnataka: కాంగ్రెస్‌ ప్రభుత్వం నెత్తిపై అత్తాకోడళ్ల వివాదాలు.. ఆ పథకమే కారణం?

1 Jun, 2023 11:22 IST|Sakshi

కర్నాటక ప్రభుత్వం ‘గృహలక్ష్మి’ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద రూ. 2000 మొత్తాన్ని ప్రతీనెలా ఇంటిలోని పెద్దకు ఇవ్వనున్నారు. ఈ పథకానికి సంబంధించిన ప్రకటన వెలువడగానే చాలా ఇళ్లలో అత్తాకోడళ్ల మధ్య గొడవలు పెరిగాయనే వార్తలు వస్తున్నాయి. ఇందుకు పలు ఉదాహరణలు కూడా కనిపిస్తున్నాయి.

ఈ పథకం కింద వచ్చే మెత్తం ఎవరు తీసుకోవాలనే దానిపై చాలా కుటుంబాలు తమలో తాము గొడవలు పడుతున్నాయి. చాలా కుటుంబాలలో అత్తాకోడళ్లు కలిసి ఉండటం లేదు. అటువంటప్పుడు ఈ మొత్తాన్ని ఎవరికి ఇస్తారని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఈ మొత్తం అత్తలకే చెందాలని కొందరు అంటుండగా, కోడళ్లకే దక్కాలని మరికొందరు అంటున్నారు. అయితే సఖ్యతగా ఉన్న కొన్ని కుటుంబాలలోని అత్తాకోడళ్లు ఆ మొత్తాన్ని చెరిసగం పంచుకుంటామని చెబుతున్నారు.

దీని గురించి కర్నాటక శిశు, మహిళా శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బల్కర్‌ మాట్లాడుతూ ‘గృహలక్ష్మి’ పథకం కింద అందించే మొత్తాన్ని పంచుకోవడంతో కుటుంబ సభ్యులదే అంతిమ నిర్ణయం అని అన్నారు. అయితే ఇంటిపెద్దగా అత్తకు ప్రాధాన్యత ఇ‍వ్వాలని అన్నారు. ఆమె ఇవ్వాలనుకుంటే కోడలికి ఈ మొత్తాన్ని అందించవచ్చన్నారు. పీడబ్ల్యుడీ మంత్రి సతీష్‌ జార్కీహోలీ మాట్లాడుతూ ‘గృహలక్ష్మి’ పథకం మొత్తం అత్తకే చెందాలని అన్నారు. ఆమెనే ఇంటిపెద్ద అని అన్నారు. ఈ విషయంలో అత్తాకోడళ్లు సయోధ్యతో మెలగాలని సూచించారు.

మరిన్ని వార్తలు