వేలాడుతున్న కరువు కత్తి

15 Jul, 2021 03:59 IST|Sakshi

కరోనాని మించిన మరో మహమ్మారి తరుముకొస్తోంది దీనికి వ్యాక్సిన్‌ కూడా ఉండదు.   ఇబ్బంది పడేది బీదాబిక్కీ జనమే.   దేశాల జీడీపీలు కూడా తల్లకిందులవుతాయి ఈ శత్రువు మనకి ఎప్పట్నుంచో తెలుసు. అదే కరువు. ఇక ముందున్నది కరువు కాలమనే వివిధ అధ్యయనాలు తేల్చేశాయి.  

కోవిడ్‌–19తో గత ఏడాదిన్నరగా కనీవినీ ఎరుగని రీతిలో ఆరోగ్య, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రపంచ దేశాలపై మరో కత్తి వేళ్లాడుతోంది. వాతావరణంలో వస్తున్న మార్పులు, అడ్డూ అదుçపూ లేకుండా పెరిగిపోతున్న జనాభా, నీటి సంరక్షణ విధానంలో లోపాలు, ప్రపంచ దేశాలపై దాడి చేస్తున్న వైరస్‌లు మరో ముప్పు ముంగిట్లో మనల్ని నెట్టేస్తున్నాయి. సమీప భవిష్యత్తులో ప్రపంచ దేశాలు కరువుతో అల్లాడిపోతాయని ఐక్యరాజ్యసమితి సహా వివిధ అధ్యయనాలు తేల్చి చెబుతున్నాయి. కరువు పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి సమగ్ర ప్రణాళికను ఇప్పట్నుంచే రూపొందించాల్సిన అవసరం ఉందని ఆ అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. భారత్‌ సహా వివిధ దేశాలు ఇప్పటికే కరువు ముప్పుని ఎదుర్కొంటున్నాయి. మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లాలో నీటి చుక్క దొరక్కపోవడంతో ఒక ఊరు ఊరంతా ఖాళీ అయింది. కేవలం ఆ గ్రామంలో 10–15 కుటుంబాలు మాత్రమే మిగలడం భవిష్యత్‌ కరువు పరిస్థితులకి అద్దం పడుతోంది.  

వేడెక్కుతున్న భూగోళం
మన భూగోళం ప్రమాదకర స్థాయిలో వేడెక్కిపోతోంది. సూర్యుడి నుంచి వచ్చే రేడియేషన్‌తో గత పదిహేనేళ్లలో భూ ఉపరితలం, సముద్రాలు రెట్టింపు వేగంతో వేడెక్కిపోతున్నాయి. ఏ స్థాయిలో వేడెక్కుతోందంటే హిరోషిమాను ధ్వంసం చేసిన నాలుగు అణుబాంబుల్ని ప్రతీ సెకండ్‌ పేలిస్తే పుట్టేంత వేడి. అర్థం కావడం లేదా ..? భూమ్మీద ఉన్న 730 కోట్ల మంది ఒకేసారి 20 వేర్వేరు ఎలక్ట్రిక్‌ పరికరాల్ని వాడితే పుట్టేంత రేడియో ధార్మికతని సూర్యుడి నుంచి పుడమి సంగ్రహిస్తోందని నాసా శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో తేలింది. దీని వివరాలను జియోఫిజికల్‌ రీసెర్చ్‌ లెటర్స్‌ జర్నల్‌ వెల్లడించింది. ఈ స్థాయిలో భూమి వేడెక్కడం వల్ల పసిఫిక్‌ మహాసముద్రంలో తరచూ లానినా, ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడి అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి పరిస్థితులు ఎదురవుతాయని ఆ అధ్యయనం హెచ్చరించింది.
లానినా, ఎల్‌నినో పరిస్థితులు 3–7 ఏళ్ల మధ్య ఏర్పడి 9–12 నెలల పాటు ఉంటాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఏళ్ల తరబడి సాగుతాయి. దీని వల్ల కరువు కాటకాలు ఏర్పడతాయి. భూగోళం వేడెక్కడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడి తీవ్ర దుర్భిక్షాన్ని ఎదుర్కోవలసి వస్తుంది.  

కరువు భూతాన్ని తరిమికొట్టడానికి  
కరువు పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి వివిధ దేశాలకు ప్రపంచ బ్యాంకు సహకారం అందిస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో నీటి సంరక్షణ, దీర్ఘకాలంలో భూగర్భ జలాల్ని సుస్థిరంగా కొనసాగడానికి ఒక ప్రాజెక్టుని మొదలుపెట్టింది. ఈ ప్రాజెక్టు వల్ల అయిదు జిల్లాల్లోని 27 లక్షల మంది రైతులకి లబ్ధి చేకూరుతుంది. 3,93,000 హెక్టార్ల భూమి సాగులోని వస్తుంది. సోమాలియాలో కరువు పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వ వ్యవస్థల్ని, విపత్తు సంసిద్ధతను పెంచే ప్రయత్నాలు చేస్తోంది. అఫ్గాన్‌లో కరువుతో అల్లాడిపోతున్న 22 లక్షల మంది పౌరులకు ఆహార భద్రతను కల్పిస్తోంది. కరువు ముప్పుని ముందుగా గుర్తించి ప్రణాళికను రచించే ప్రాజెక్టుని ప్రారంభిస్తోంది.

అధ్యయనాలు చెబుతున్నదేంటంటే..
► 5 వేల ఏళ్లుగా కరువు అంటే మానవాళికి తెలుసు. కానీ ఇప్పుడు ఈ కరోనా వేళ పులి మీద పుట్రలా భారత్, ఉక్రెయిన్, మాల్డోవా, బంగ్లాదేశ్, సెర్బియా దేశాలు కరువు ముప్పులో ఉన్నాయి.  
► భారత్‌ స్థూల జాతీయోత్పత్తిపై కరువు ఏడాదికి 2–5% మేర ప్రభావం చూపిస్తుంది. మన లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది పెద్ద దెబ్బ.  
► కరువు పరిస్థితులు అగ్రరాజ్యం అమెరికాలో ఏడాదికి 640 కోట్ల డాలర్ల నష్టాన్ని కలుగజేస్తాయి. యూరప్‌లో ఏడాదికి 900 కోట్ల యూరోల నష్టం కలుగుతుంది.  
► గత 150 ఏళ్లకాలంలో దక్కను పీఠభూముల్లో తీవ్రమైన కరువు పరిస్థితులు ఎదురయ్యా యి. 1876–1878, 1899–1900, 1918– 1919, 1965–67, 2000–2003, 2015– 18లలో భారత్‌ కరువుని ఎదుర్కొంది.  
► ప్రపంచ జనాభాలో అయిదో వంతు నీటి ఎద్దడి ప్రాంతాల్లో నివసిస్తున్నారు.  
► దక్షిణార్ధ గోళాల దేశాల్లో వర్షపాతం 30% తగ్గిపోనుంది.  
► 92 ఏళ్లలో బ్రెజిల్‌ కనీవినీ ఎరుగని కరువు పరిస్థితుల్ని ఎదుర్కొంటుంది.  
► అమెరికాలోని కాలిఫోర్నియా ప్రతీ ఏడాది కరువుకి హాట్‌స్పాట్‌గా మారుతోంది. భరించలేనంత ఎండవేడిమితో కార్చిచ్చులు ఏర్పడుతున్నాయి
► మరి కొద్ది ఏళ్లలో ప్రపంచంలో అత్యధిక దేశాలు నీటి కొరతతో అల్లాడిపోతాయి.

ప్రపంచాన్ని కబళించే మరో మహమ్మారి కరువు. దీనికి చికిత్సనివ్వడానికి ఎలాంటి వ్యా క్సిన్‌ ఉండదు. ఈ శతాబ్దంలో కరువు పరిస్థితులు 150 కోట్ల మందిపై ప్రభావం చూపించాయి. 12,400 కోట్ల డాలర్లకి పైగా నష్టం వాటిల్లింది. ప్రభుత్వాలు చర్యలు చేపట్టకపోతే ఎప్పుడూ ఉండే కారణాలతో పాటు కరోనా మహమ్మారి తోడు కావడం కరువుని మరింత పెంచేస్తుంది.
– మామి మిజుతొరి, యూఎన్‌డీఆర్‌ఆర్‌ చీఫ్‌ 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

మరిన్ని వార్తలు