ఓటు వలస వెళుతుందా? ఈవీఎం లోపాలు పరిష్కరించకుండా ఆర్‌వీఎంలు ఎందుకు?

21 Jan, 2023 06:41 IST|Sakshi

ఓటు. ప్రజాస్వామ్యం మనకిచ్చిన శక్తిమంతమైన ఆయుధం. అయినా దానిని వినియోగించుకోవడంలో ఏదో తెలీని ఉదాసీనత కనిపిస్తోంది. ముఖ్యంగా ఉపాధి కోసం వేరే ఊళ్లు వెళ్లే వలసదారులు ఓటు వెయ్యడానికి సుముఖత చూపించడం లేదు. అందుకే దేశంలో ఎక్కడ నుంచైనా ఓటు వెయ్యడానికి వీలు కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం విప్లవాత్మక మార్పులకి శ్రీకారం చుట్టింది. అవే రిమోట్‌ ఓటింగ్‌ మెషీన్లు(ఆర్‌వీఎం).

ఈ ఓటింగ్‌ మెషీన్ల ద్వారా సొంతూరుకి వెళ్లకుండా తాముండే ప్రాంతం నుంచి తమ నియోజకవర్గం అభ్యర్థిని ఎన్నుకునే అవకాశం లభిస్తుంది. ఈ నమూనా ఆర్‌వీఎంలను ప్రదర్శించడం కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 16న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే కాంగ్రెస్‌ సహా 13 పార్టీలు వీటిని తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇప్పటికే ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలపై విశ్వాసమే లేకుండా ఉన్న ఈ సమయంలో ఈ కొత్త ప్రక్రియకు తెరతీసి ఓటింగ్‌ వ్యవస్థను గందరగోళం చెయ్యడమెందుకనే చర్చ మొదలైంది.

కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ, జనతా దళ్‌ (యూ), శివసేన (ఉద్ధవ్‌ వర్గం), ఎన్‌సీపీ, సీపీఎం వ్యతిరేకంగా ఉండడంతో నమూనా ఆర్‌వీఎంల ప్రదర్శన జరగకుండానే సమావేశం ముగిసింది. అయితే వలస ఓటర్ల ఓటింగ్‌ శాతం పెంపు లక్ష్యంగా తాము చేస్తున్న ప్రయత్నాలను ముందుకు తీసుకువెళ్లడానికి సీఈసీ రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఫిబ్రవరి 28 వరకు గడువు పెంచింది.

ఎందుకీ ఆర్‌వీఎంలు ?
వలస ఓటర్లలో మూడో వంతు మంది ఎన్నికల్లో తమ ఓటు హక్కుని వినియోగించుకోవడం లేదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 67.4శాతం మాత్రమే ఓటింగ్‌ నమోదైంది. దాదాపుగా 30 కోట్ల మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఉన్న చోటు నుంచి సొంతూరికి వెళ్లే అవకాశం లేకపోవడం, ఓటర్ల జాబితాలో పేరు లేకపోవడం వంటి ఎన్నో కారణాలతో వారు ఓటు వెయ్యడం లేదు. భారత ప్రధాన ఎన్నికల అధికారిగా రాజీవ్‌ కుమార్‌ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వలస ఓటర్లపై దృష్టి కేంద్రీకరించి రిమోట్‌ ఓటింగ్‌ ప్రక్రియకు తెరతీశారు.

ఆర్‌వీఎంలు ఎలా పని చేస్తాయి ?
ప్రస్తుతం ఎన్నికల్లో వినియోగిస్తున్న ఎలక్ట్రానింగ్‌ ఓటింగ్‌ మెషీన్లకు (ఈవీఎం) ఇది సవరించిన వెర్షన్‌. ఇతర ప్రాంతాల్లో ఉన్న వలస ఓటర్లు తమ నియోజకవర్గంలో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత తాము ఏ ప్రాంతం నుంచి ఓటు హక్కు వినియోగించుకుంటారో రిజిస్టర్‌ చేసుకోవాలి. అలా రిజిస్టర్‌ చేసుకున్న వారిని రిమోట్‌ ఓటర్లు అని పిలుస్తారు. తమ ప్రాంతంలో ఉన్న రిమోట్‌ పోలింగ్‌ బూత్‌కు వెళితే ఆ ఓటరు నియోజకవర్గం వివరాలను కానిస్టిట్యూయెన్సీ కార్డ్‌ రీడర్‌ (సీసీఆర్‌) ద్వారా స్కాన్‌ చేసి గుర్తిస్తారు.

అప్పుడు ఆర్‌వీఎం మెషీన్ల్లపై ఆ నియోజకవర్గానికి సంబంధించిన బ్యాలెట్‌ పత్రం డిస్‌ప్లే అవుతుంది. తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేస్తే రాష్ట్రం కోడ్, నియోజకవర్గం, అభ్యర్థుల నెంబర్‌ వివరాలన్నీ రిమోట్‌ కంట్రోల్‌ యూనిట్‌లో రికార్డు అవుతాయి. ఓటు నమోదైనట్టుగా వీవీప్యాట్‌ స్లిప్‌ వస్తుంది. ఎలక్ట్రానిక్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా తయారు చేసిన ఆర్‌వీఎంలు ఇంటర్నెట్‌ అవసరం లేకుండా పని చేస్తాయి.

ప్రతిపక్షాల అభ్యంతరాలు ఇవీ
► సీఈసీ ప్రతిపాదనలేవీ సమగ్రంగా లేవు. ఆర్‌వీఎంల వ్యవస్థ పైపైన రూపొందించినట్టుగా ఉంది.
► ఈవీఎంల పని తీరుపైనే సవాలక్ష సందేహాలున్న ప్రస్తుత పరిస్థితుల్లో అదే నమూనాలో రూపొందించిన ఆర్‌వీఎంలతో ఒనగూరే ప్రయోజనం ఉండదు.
► ప్రాంతీయ పార్టీలకు, చిన్న పార్టీలకు ఈ వ్యవస్థ ఏ మాత్రం అనుకూలం కాదు. దేశవ్యాప్తంగా ఏర్పాటయ్యే వివిధ పోలింగ్‌ బూత్‌లలో వారు తమ ఏజెంట్లను ఏర్పాటు చేసుకునే వనరులు ఆ పార్టీలకు ఉండవు.
► ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు వేరే రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమల్లో ఉండకపోవడం వల్ల అక్కడ ఉండే వలస ఓటర్లని రాజకీయ పార్టీలు సులభంగా ప్రలోభ పెట్టొచ్చు
► ఓటరు స్థానికంగా నివాసం లేకపోతే రాజకీయ పార్టీలపై ఏర్పరచుకునే అభిప్రాయాలు, ఓటు వేయడంలో వారు తీసుకునే నిర్ణయాల్లో తప్పిదాలు జరిగే అవకాశం ఉంటుంది.
► దేశంలో ఒక చోట ఎన్నికలు జరుగుతూ ఉంటే, మరెక్కడి నుంచో ఓటు వేసే వ్యక్తి అసలు సిసలు ఓటరేనని ఎలా నమ్మాలి. ఓటింగ్‌లో జరిగే అక్రమాలు ఇకపై వివిధ నియోజకవర్గాలకు విస్తరిస్తాయి.

ఈసీ ఎదుట ఉన్న సవాళ్లు
► అసలు వలస ఓటర్లు అంటే ఎవరు ? వారిని ఎలా గుర్తించాలి. వలస ఓటర్లను గుర్తించడంలో ఏర్పడే న్యాయపరమైన చిక్కుల్ని ఎదుర్కోవడం
► ఈవీఎంలకు సవరించిన వెర్షన్‌గా రూపొందించిన ఆర్‌వీఎంలలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలకు పరిష్కారం కనుగొనడం
► ఎన్నికల్లో ఎన్ని రిమోట్‌ ఓటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న దానిపై స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోవడం
► ఒక రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతూ ఉంటే వలస ఓట్లు ఉండే అన్ని ప్రాంతాల్లోనూ ఎన్నికల నియమావళిని అమలు చేయడానికి ఎలాంటి కసరత్తు చేయాలి.
ఇలాంటి సవాళ్లను అధిగమించడానికే ఎన్నికల సంఘం రాజకీయ పార్టీల అభిప్రాయాలను కోరుతోంది. 
                    

రిమోట్‌ ఓటింగ్‌ అనేది ఎన్నికల ప్రకియలో ఒక విప్లవాత్మకమైన మార్పు. పట్టణ ప్రాంతాల్లో, యువతలోనూ ఓటుపై ఆసక్తి పెంచడమే ధ్యేయంగా పని చేస్తున్నాం. కానీ దీని అమలులో ఎన్నో సవాళ్లున్నాయి. ఇది అంత సులభంగా జరిగేది కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిర్ణయాలు తీసుకోవడానికి సమయం పడుతుంది. మేం వేసే ప్రతీ అడుగు ముందడుగానే ఉంటుంది.
రాజీవ్‌ కుమార్, సీఈసీ

ధనిక పార్టీ అయిన బీజేపీకి ఇలాంటి ప్రక్రియలు అనుకూలంగా ఉంటాయి. ప్రాంతీయ పార్టీల ఆందోళనలో అర్థం ఉంది. రిమోట్‌ బూత్‌లున్న ప్రతిచోటా పోలింగ్‌ ఏజెంట్లను తెచ్చిపెట్టుకునే సామర్థ్యం వారికి ఉండదు. ఎన్నికల బరిలో ఉన్న పార్టీలకు చెందిన పోలింగ్‌ ఏజెంట్లు లేకుండా రిమోట్‌ ఓటింగ్‌ ప్రక్రియను నిర్వహించడం సరి కాదు.
జగ్‌దీప్‌ చొకార్, అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రాటిక్‌ రిఫారమ్స్‌ సహ వ్యవస్థాపకుడు

ఇటీవల జరిగిన గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో చివరి గంటలో 10 నుంచి 12% ఓట్లు పోలయినట్టు గుర్తించాం. అంటే ప్రతీ 25–30 సెకండ్లకి ఒక ఓటు పోలయినట్టు లెక్క. అదెలా సాధ్యం. ఒక ఓటు నమోదు కావడానికి కనీసం 60 సెకండ్ల సమయం పడుతుంది. ఈవీఎంలలో కళ్లకు కట్టినట్టు ఇన్ని దారుణాలు జరుగుతూ ఉంటే ఆర్‌వీఎం అవసరం ఏమొచ్చింది..?
జైరామ్‌ రమేష్, కాంగ్రెస్‌ ఎంపీ

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

మరిన్ని వార్తలు