ప్లాస్మా ఇస్తే పోలీసులకు సెలవు, నగదు పారితోషికం

17 May, 2021 03:40 IST|Sakshi

రైల్వే పోలీసులకు కమిషనర్‌ కైసర్‌ ఖాలీద్‌ ఆఫర్‌ 

సాక్షి, ముంబై: కరోనా రోగులకు అవసరమైన ప్లాస్మా దానం చేయడానికి ముందుకు వచ్చిన పోలీసులకు ఒక రోజు సెలవు, నగదు పారితోషికంతో గౌరవిస్తామని రైల్వే పోలీసు కమిషనర్‌ కైసర్‌ ఖాలీద్‌ ప్రకటించారు. దీంతో వంద మంది రైల్వే పోలీసులు ప్లాస్మా దానం చేయడానికి ముందుకు వచ్చారు. ప్లాస్మా అవసరమైన కరోనా రోగుల జాబితాను వివిధ ఆస్పత్రులను తెప్పిస్తామని కమిషనర్‌ వెల్లడించారు. ఆ తరువాత జాబితాను పరిశీలించి సాధ్యమైనంత త్వరగా వారికి అందజేసే ప్రయత్నం చేస్తామని ఖాలీద్‌ తెలిపారు.  


ప్రత్యేక వెబ్‌సైట్‌.. 
బ్రేక్‌ ది చైన్‌లో భాగంగా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో రైల్వే పోలీసులపై ఇప్పటికే అదనపు భారం పడుతోంది. దూరప్రాంతాలకు వెళ్లే సామాన్య ప్రయాణికులను, కూలీలను, కార్మికులను ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో కూర్చోబెట్టడం మొదలుకుని ప్లాట్‌ఫారంపై, స్టేషన్‌ పరిసరిల్లో గస్తీ నిర్వహించే బాధ్యతలు వారిపై ఉన్నాయి. ఇప్పటి వరకు 700 మందికిపైగా రైల్వే పోలీసులు కరోనా బారిన పడ్డారు. అందులో అనేక మంది కరోనా నుంచి కోలుకుని ఎప్పటిలాగా మళ్లీ విధుల్లో చేరారు. ప్రస్తుతం కరోనా రెండో వేవ్‌ విజృంభించడంతో అనేక మంది కరోనా రోగులకు ప్లాస్మా అవసరం ఏర్పడింది. ఇదిలా ఉండగా ప్లాస్మా అవసరమైన రోగుల మేసేజ్‌లు కొద్ది రోజులుగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఖాలీద్‌ సంబంధిత రైల్వే అధికారులతో చర్చించారు. ప్లాస్మ దానం చేయడంవల్ల విధులు నిర్వహించే పోలీసులపై ఏమైనా ప్రభావం చూపుతుందా..? తదితర అంశాలపై ఆరా తీశారు.

ప్లాస్మా దాతలను, ప్లాస్మా అవసరమైన రోగులను ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ను రూపొందించాలని నిర్ణయించారు. ప్రత్యేకంగా 1800120080000 అనే టోల్‌ ఫ్రీ హెల్ఫ్‌లైన్‌ నంబరును అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వంద మంది పోలీసులు ముందుకు వచ్చారు. ప్లాస్మా దానం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. దీంతో ప్లాస్మాదాతల పేర్లు రిజిస్ట్రేషన్‌ చేశారు. మరోపక్క తమకు ప్లాస్మా కావాలని 110 మంది కరోనా బాధితులు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో వంద మంది రైల్వే పోలీసుల ప్లాస్మ సేకరించి అవసరమైన కరోనా రోగులకు వెంటనే అందజేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఖాలీద్‌ తెలిపారు. అయితే మరోవైపు ప్లాస్మా చికిత్సను నిలిపివేయాలని పలువురు వైద్యనిపుణులు ఐసీఎంఆర్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఐసీఎంఆర్‌ తుదినిర్ణయంపైనా ప్లాస్మా దానం ఆధారపడి ఉంది.  

మరిన్ని వార్తలు