గిన్నిస్‌ రికార్డ్‌లో చోటు దక్కించుకున్న నాగ్‌పూర్‌ మెట్రో.. గడ్కరీ ప్రశంసలు

6 Dec, 2022 17:54 IST|Sakshi

ముంబై: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ మెట్రో రైలు అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రెండంతస్తుల ఫ్లైఓవర్‌ గల మెట్రోగా గిన్నిస్‌ రికార్డు సాధించింది. వార్ధా రోడ్‌లో నిర్మించిన ఈ డబుల్‌ డక్కర్‌ వయడక్ట్‌ సుమారు 3.14 కిలోమీటర్ల మేర ఉంటుంది. నాగ్‌పూర్‌లోని మెట్రో భవన్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమం వేదికగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ సర్టిఫికెట్‌ అందుకున్నారు మహారాష్ట్ర మెట్రో ఎండీ బ్రిజేశ్‌ దీక్షిత్‌. గిన్నిస్‌ రికార్డ్స్‌ జడ్జి రిషి నాత్‌ ధ్రువీకరణ పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన దీక్షిత.. వార్దా రోడ్‌లో ఈ నిర్మాణాన్ని చేపట్టటం ప్రధాన సవాల్‌గా మారిందన్నారు. ఇది థ్రీటైర్‌ నిర్మాణం.

గడ్కరీ ప్రశంసలు..
నాగ్‌పూర్‌ మెట్రో రైలు గిన్నిస్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించిన క్రమంలో మహారాష్ట్ర మెట్రో విభాగానికి శుభాకాంక్షలు తెలిపారు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ. ట్విట్టర్‌ వేదికగా ప్రశంసలు కురిపించారు. ఇప్పటికే అత్యంత పొడవైన డబుల్‌ డక్కర్‌ వయడక్ట్‌గా ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. పైన మెట్రో వెళ్తుండగా.. మధ్యలో హైవే, కింద సాధారణ రవాణా మార్గం ఉంటుంది. 

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెట్రో నిర్మాణాల్లో ఇంత పొడవు మేర రెండంతస్తుల ఫ్లైఓవర్‌  ఎక్కడా నిర్మించలేదు. దీని పొడవు 3.14 కిలోమీటర్లు ఉంటుంది. గతంలో డబుల్‌ డక్కర్‌ వయడక్ట్‌ పద్ధతిలో అత్యధిక మెట్రో స్టేషన్లు నిర్మించిన విభాగంలోనూ ఆసియా, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది మహారాష్ట్ర మెట్రో.

ఇదీ చదవండి: ‘ఎయిమ్స్‌’ తరహాలో ‘ఐసీఎంఆర్‌’పై సైబర్‌ దాడి.. 6వేల సార్లు విఫలయత్నం

మరిన్ని వార్తలు