భారీ వర్షాలు: మునిగిన 12 పడవలు..

2 Dec, 2021 15:05 IST|Sakshi

గుజరాత్‌లో పెను విషాదం

సముద్రంలో మునిగిన 12 పడవలు

రంగంలోకి దిగిన నేవీ.. 2 హెలికాప్టర్ల సాయంతో గాలింపు చర్యలు

Gujarat 12 Boats Sink in Sea Near Gir Somnath: గుజరాత్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన 12 పడవలు మునిగిపోయాయి. వీటిల్లో 23 మంది మత్స్యకారులు ఉన్నట్లు సమాచారం. వీరిలో ఇప్పటి వరకు 11 మందిని కాపాడగ.. మిగతా వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దక్షిణ గుజరాత్‌లో బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. 

వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చిన మార్పు కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం నుంచి గుజరాత్‌ వ్యాప్తంగా పలు నగరాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. అదే సమయంలో అరేబియా సముద్రం సమీపంలోని గిర్-సోమ్‌నాథ్ ప్రాంతంలో,  బలమైన గాలులు వీచాయి. ఆ సమయంలో సముద్రంలోకి వేటకు వెళ్లిన 12 మత్స్యకారుల పడవలు మునిగిపోయాయి.
(చదవండి: విషాదం నింపిన విహారయాత్ర)

వాతావరణ మార్పుల గురించి అధికారులు మంగళవారం సాయంత్రం నుంచే హెచ్చరికలు జారీ చేశారు. వేటకు వెళ్లవద్దని పదే పదే హెచ్చరించారు. కానీ మత్స్యకారులు వాటిని పట్టించుకోకుండా వేటకు వెళ్లి.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. బుధవారం ప్రమాదం జరగడానికి కొంత సమయం ముందు కూడా అధికారుల హెచ్చరికలు జారీ చేశారు. 

సముద్రం లోపలికి వెళ్లవెద్దని అధికారులు హెచ్చరించారు. దాంతో చాలా మంది మత్స్యకారలు వెనక్కి వచ్చేశారు. గల్లంతయిన వారు కూడా తిరిగి వస్తుండగా.. బలమైన గాలులు వీచడం.. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో వీరంతా గల్లంతయ్యారు. ప్రస్తుతం నేవీ అధికారులు, రెండు హెలికాప్టర్లను రంగంలోకి దించి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
(చదవండి: చేపల ఆశీస్సులు కూడా ఉండాలి: కేంద్రమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు)

దక్షిణ గుజరాత్‌ ప్రాంతంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ఉన్నట్లుండి మూడు డిగ్రీలకు దిగజారింది. ఈ క్రమంలో డయ్యూ ప్రాంతంలో కూడా పడవ మునిగిపోవడం కారణంగా ఓ మత్స్యకారుడు మృతి చెందాడు. 

చదవండి: దొంగతనం: 3 నెలలుగా ఒంటిపూట భోజనం.. 10 కేజీలు బరువు తగ్గి మరీ

మరిన్ని వార్తలు