కోవిడ్‌తో 15 రోజుల పసికందు మృత్యువాత

17 Apr, 2021 13:41 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కరోనా మహమ్మారి ఎవరిని వదిలిపెట్టడం లేదు. పసిగుడ్డు నుంచి పండు ముదుసలి వరకు అందరినీ కాటేస్తోంది. కరోనా బారిన మహిళ​కు జన్మించిన శిశువు మృతి చెందిన సంఘటన ఆందోళన రేకిత్తిస్తోంది.

అహ్మదాబాద్‌/సూరత్‌: కోవిడ్‌తో బాధపడుతున్న తల్లికి జన్మించిన బిడ్డ కరోనాతో మృత్యువాత పడిన ఘటన గుజరాత్‌లోని సూరత్‌ నగరంలో చోటుచేసుకుంది. గురువారం రాత్రి శిశువు మరణించినట్లు వైద్యులు స్పష్టం చేశారు. ఈ నెల 1న  సూరత్‌ నగరంలోని డైమండ్‌ ఆస్పత్రిలో జన్మించిన శిశువును మరో ఆస్పత్రికి తరలించి వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం చేశామని వైద్యులు తెలిపారు.

బిడ్డ ప్రాణాలు రక్షించేందుకు తమకు తెలిసిన అన్ని రకాల వైద్య పద్ధతులను ఉపయోగించామని, అయితే ప్రయోజనం లేకుండా పోయిందని విచారం వ్యక్తం చేశారు. ఇటీవలే కోవిడ్‌ నుంచి కోలుకున్న వైద్యుడి సీరాన్ని తీసి బిడ్డకు ఎక్కించామని, రెమిడిసివిర్‌ ఇంజెక్షన్‌ సైతం ఇచ్చి చూశామని అయితే బిడ్డ ప్రాణాలను రక్షించలేకపోయామని పేర్కొన్నారు.

 
‘నవజాత శిశువును కాపాడటానికి మా వైద్యులు తమ వంతు ప్రయత్నం చేశారు. నాకు తెలిసినంత వరకు గుజరాత్‌ కరోనావైరస్ బాధితులలో ఈ నవజాత శిశువు అతి పిన్న వయస్కులలో ఒకర’ని కోవిడ్‌ నుంచి ఇటీవల కోలుకున్న సూరత్ మాజీ మేయర్ డాక్టర్ జగదీష్ పటేల్ అన్నారు.  శిశువు చికిత్స కోసం తన రక్త ప్లాస్మాను ఆయన దానం చేశారు. కాగా, తాపి జిల్లాకు చెందిన 14 రోజుల పసిబాలుడు కరోనా బారిన పడి సూరత్ కొత్త సివిల్ ఆసుపత్రిలో బుధవారం మరణించాడు. 


గతేడాది మొదటివేవ్‌ కంటే ఈసారి ఎక్కువ మంది పిల్లలు కరోనావైరస్ బారిన పడుతున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందుతో పోలిస్తే కొత్త స్ట్రెయిన్‌ సంక్రమణ రేటు ఎక్కువగా ఉందని అభిప్రాయపడుతున్నారు. కరోనా సోకిన కుటుంబ సభ్యుల నుంచే పిల్లలకు కోవిడ్‌ వ్యాపిస్తోందని అహ్మదాబాద్‌కు చెందిన శిశువైద్యుడు డాక్టర్ నిశ్చల్ భట్ చెప్పారు. ప్రభుత్వ  తాజా గణాంకాల ప్రకారం గుజరాత్‌లో శనివారం  నాటికి 49,737 యాక్టివ్‌ కరోనా కేసులు నమోదయ్యాయి. 

ఇక్కడ చదవండి:
లాన్సెట్ సంచలన నివేదిక‌: గాలి ద్వారానే కోవిడ్‌ అధిక వ్యాప్తి

సెకండ్‌ వేవ్‌ మరింత ప్రమాదకరం.. గంటల వ్యవధిలో వైరస్‌ లోడ్‌ కమ్యూనిటీ స్ప్రెడ్‌ 

మరిన్ని వార్తలు