యూత్‌ వింగ్‌ లీడర్‌ హల్‌చల్‌.. పోలీసులపైకి దూసుకెళ్లిన కారు.. వీడియో వైరల్‌

7 Apr, 2022 11:25 IST|Sakshi

గాంధీనగర్‌: పోలీసు కానిస్టేబుల్‌పై హత్యాయత్నం నేరం కింద ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకుడు అరెస్ట్‌ అయ్యాడు. వివిధ సెక్షన‍్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీ కింద జైలుకు తరలించారు. 

వివరాల ప్రకారం.. డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడి చేసి, కానిస్టేబుల్‌ను తన కారు బానెట్‌పైకి లాగినందుకు గుజరాత్ ఆప్ యువజన విభాగం నాయకుడు యువరాజ్‌సింగ్ జడేజాను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, మంగళవారం కొందరు నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం గాంధీనగర్‌లోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌ వద్ద నిరసనలకు దిగారు. వారికి మద్దతు తెలిపేందుకు జడేజా అక్కడికి వచ్చారు. ఈ క్రమంలో పోలీసులు నిరసనకారులను అరెస్ట్‌ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు, జడేజా మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. 

అనంతరం అక్కడి నుంచే వెళ్లిపోయే క్రమంలో జడేజా.. వేగంగా తన కారు నడుపుతూ పోలీసులపైకి దూసుకెళ్లాడు. ఈ క్రమంలో కారు ఓ కానిస్టేబుల్‌ పైకి దూసుకెళ్లగా.. అతను కారు బ్యానెట్‌పైకి ఎక్కి జాగ్ర‍త్తపడ్డాడు. అనంతరం జడేజా అక్కడి నుంచే పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసులపై హత్యాయత్నం కింద ఆప్‌ నేతపై కేసు నమోదు చేసినట్టు ఇన్‌స్పెక్టర్ జనరల్ (గాంధీనగర్ రేంజ్) అభయ్ తెలిపారు. 

జడేజా అరెస్ట్‌పై ఆప్‌ నేత ప్రవీణ్ రామ్ స్పందిస్తూ.. బీజేపీ ప్రభుత్వం తమను(ఆప్‌) చూసి భయపడుతోందని ఆరోపించారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదని అన్నారు. ప్రభుత్వ రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో అక్రమాలను బయటపెట్టిన తర్వాత జడేజాను సర్కార్‌ టార్గెట్‌ చేసిందన్నారు. ఫారెస్ట్ గార్డుల రిక్రూట్‌మెంట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం కూడా లీక్ అయిందని జడేజా ఇటీవల పేర్కొన్నాడు. 

మరిన్ని వార్తలు