Gujarat Assembly Elections 2022: ముగిసిన గుజరాత్ తొలి విడత ఎన్నికలు.. 60 శాతానికిపైగా పోలింగ్!

1 Dec, 2022 17:28 IST|Sakshi

05.30 PM
ముగిసిన పోలింగ్‌..

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌ చిన్ని చిన్న ఘటనలు, విపక్షాల ఆరోపణల మధ్య  ప్రశాంతంగా ముగిసింది. తొలి విడత ఎన్నికల్లో 60 శాతానికిపైగా పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 

04:10 PM
13,065 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌క్యాస్టింగ్‌
గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌ చెదురుమదురు ఘటనల మధ్య కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 48.48 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అత్యధికంగా తపి నియోజకవర్గంలో 63.98శాతం ఓటింగ్‌ నమోదైంది. 13,065 పోలింగ్‌ కేంద్రాల్లో లైవ్‌ వెబ్‌క్యాస్టింగ్‌ ఏర్పాటు చేశారు. 

02:20 PM
గుజరాత్ తొలి విడత ఎన్నికల పోలింగ్‌ ప్రశాంత జరుగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 34.48 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు బారులుతీరారు. 

11:50 AM
నెమ్మదిగా పోలింగ్..

గుజరాత్ తొలి విడత ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 18.95 శాతం పోలింగ్ నమోదైంది. పలు చోట్ల ఓటింగ్ నత్త నడకన సాగుతోంది. 

10:35 AM
ఓటేసిన క్రికెటర్ రవీంద్ర జడేజా

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. భారత క్రికెటర్ రవీంద్ర జడేజా, ఆయన సతీమణి రివబ జడేజా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జామ్‌నగర్‌లోని ఓ పోలింగ్ స్టేషన్‌కు వెళ్లి ఓటు వేశారు. ప్రజలంతా పెద్ద సంఖ్యలో తరలివచ్చి పోలింగ్‌లో పాల్గొనాలని రవీంద్ర జడేజా పిలుపునిచ్చాడు. ఈ ఎన్నికల్లో అతని భార్య రివబ బీజేపీ తరఫున జామ్‌నగర్ నుంచే పోటీ చేస్తోంది.

తండ్రి కాంగ్రెస్‌..
రవీంద్ర జడేజా భార్య బీజేపీ తరఫున పోటీ చేస్తుంటే.. ఆయన తండ్రి అనిరుధ్ సిన్హ్‌ జడేజా మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేశారు. కుమార్తె  నైనా జడేజాతో కలిసి వచ్చి జామ్‌నగర్‌లోని ఓ పోలింగ్ స్టేషన్‌లో ఓటేశారు. ఇద్దరూ కాంగ్రెస్‌కే మద్దతు తెలిపారు. రాజకీయ పార్టీల విషయంలో అభిప్రాయాలు వేరైనప్పటికీ కుటంబపరంగా తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని జడేజా తండ్రి స్పష్టం చేశారు. తాను ఎప్పటినుంచో కాంగ్రెస్‌ పార్టీలో ఉంటున్నట్లు పేర్కొన్నారు.

9:30 AM
ఓటేసిన శతాధిక వృద్ధురాలు..
తొలి విడత పోలింగ్‌లో కాముబెన్ లాలాభాయ్ పటేల్‌ అనే 100 ఏళ్ల బామ్మ తన ఓటు హక్కు వినియోగుంచుకుంది. ఉమర్‌గాంలోని ఓ పోలింగ్ స్టేషన్‌కు వెళ్లి ఓటేసింది.

9:10 AM
గ్యాస్ సిలిండర్‌తో పోలింగ్ స్టేషన్‌కు..

గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పరేష్ ధనాని సైకిల్‌పై గ్యాస్ సిలిండర్‌తో పోలింగ్ స్టేషన్‌కు పెళ్లారు. బీజేపీలో పాలనలో ధరల పెరుగుదలకు నిరసనగా ఇలా చేశారు.

8:30 AM
ఓటేసిన మంత్రి..

గుజరాత్‌లో తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది. మంత్రి పూర్ణేష్ మోదీ.. సూరత్‌లోని ఓ పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

8:00 AM
పోలింగ్ ప్రారంభం

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. 89 నియోజకవర్గాల్లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించునేందుకు పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటున్నారు.

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఉదయం 8 గంటల నుంచి ఓటింగ్ ప్రారంభమవుతుంది. సౌరాష్ట్ర, కచ్, దక్షిణ గుజరాత్‌ ప్రాంతాల్లోని 19 జిల్లాల్లో 89 స్థానాలకు మొదటి దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. త్రిముఖ పోటీ నెలకొన్న ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ హోరాహోరిగా ప్రచారాన్ని నిర్వహించగా, కాంగ్రెస్‌ పార్టీ నిశ్శబ్ధ ప్రచారం అంటూ క్షేత్ర స్థాయిలో నాయకులు గడప గడపకు తిరుగుతూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు.

2017 ఫలితాలు ఇలా..
 తొలి దశ పోలింగ్ జరుగుతున్న ఈ 89 స్థానాల్లో 2017 ఎన్నికల్లో   బీజేపీ 48 చోట్ల విజయం సాధిస్తే కాంగ్రెస్‌ 40 సీట్లలో గెలుపొందింది. ఒక్క స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఈ సారి ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా బలం పుంజుకోవడంతో త్రిముఖ పోటీ నెలకొంది. ఇక ఎస్పీ, బీఎస్పీ, లెఫ్ట్‌ పార్టీలతో పాటుగా, భారతీయ ట్రైబల్‌ పార్టీ (బీటీపీ) కూడా పోటీ చేస్తున్నాయి. 

బరిలో 788 మంది
తొలి దశలో 788 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.బీజేపీ, కాంగ్రెస్‌ మొత్తం 89 స్థానాల్లో పోటీ పడుతూ ఉంటే, ఆప్‌ 88 స్థానాల్లో పోటీ చేస్తోంది.. తూర్పు సూరత్‌ నియోజకవర్గం అభ్యర్థి ఆఖరి నిమిషంలో తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో ఆప్‌ 88 స్థానాలకే పరిమితమవాల్సి వచ్చింది.  ఆప్‌ సీఎం అభ్యర్థి ఇసుదాన్‌ గధ్వీ ద్వారక జిల్లాలోకి కంభాలియా నుంచి పోటీ పడుతూ ఉంటే ఆప్‌ రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్‌ ఇటాలియా సూరత్‌లోని కటాగ్రామ్‌ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తొలి దశ పోటీలో ఉన్న ముఖ్యుల్లో క్రికెటర్‌ రవీంద్ర జడేజా భార్య రవీబా జడేజా జామ్‌నగర్‌ (ఉత్తరం) నుంచి బరిలో ఉన్నారు.   

పోలింగ్‌ జరగనున్న నియోజకవర్గాలు- 89
పోటీ పడుతున్న అభ్యర్థులు-   788
మహిళా అభ్యర్థులు-    70
స్వతంత్ర అభ్యర్థులు-    339
ఓటర్ల సంఖ్య-    2.39 కోట్లు
పోలింగ్‌ కేంద్రాలు - 1,432 

మరిన్ని వార్తలు