Gujarat Couple Parasailing: వైరల్‌: ఆకాశంలో క్రేజీ కపుల్స్‌.. అంతలో తాడు తెగింది..

17 Nov, 2021 17:22 IST|Sakshi

ప్రస్తుత బిజీ లైఫ్‌లో తీరిక దొరికినప్పుడో, లేదా తీరిక చేసుకుని చాలా మంది విహారయాత్రకు వెళ్తుంటారు. అయితే కొందరు పర్యాటక ప్రాంతాల్లో అడ్వెంచర్స్‌ చేయాలని ప్రయత్నిస్తుంటారు. ఎందుకంటే టూర్‌కి వెళ్లడం సరదానిస్తే, అలాంటివి కిక్కునిస్తాయి. అయితే సాహసాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి లేదంటే ప్రమాదాలను కోరి తెచ్చుకన్నట్లే. తాజాగా ఓ జంట ఇలాంటి సాహసమే చేస్తూ ప్రమాదం బారిన పడ్డారు. ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 

వివరాల్లోకి వెళితే.. కేంద్ర పాలిత ప్రాంతం డయ్యూలో గుజరాత్‌కు చెందిన ఓ జంట విహారయాత్రకని వెళ్లారు. దీవి కావడంతో సముద్రం, బోటింగ్‌, పారాసెయిలింగ్‌ సహజమే. ఆదివారం ఆ జంట ఉనా తీరం బీచ్‌లో పారాసెయిలింగ్‌ చేశారు. పడవలో ఉన్న మరో వ్యక్తి దీన్ని వీడియో తీశారు. అయితే ఆ దంపతులు చాలా ఎత్తుకు ఎగిరిన తర్వాత పడవ, పారాసెయిలింగ్‌ మధ్య ఉన్న తాడు తెగిపోయింది. దీంతో ఆ జంట సముద్రంలో పడిపోయింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో వారికి ఎలాంటి గాయాలు కాలేదు. ముందస్తు జాగ్రత్తగా ఆ జంట లైఫ్‌ జాకెట్లు ధరించడంతో సముద్రంలో మునిగిపోకుండా నీటిపై తేలారు.

తక్షణమే స్పందించిన బీచ్‌రెస్క్యూ సిబ్బంది జంటను కాపాడారు. పారాసెయిలింగ్‌ బోటు సిబ్బంది తమను పట్టించుకోలేదని, కొంత సేపటి తర్వాత రెస్క్యూ సిబ్బంది వచ్చి తమను కాపాడినట్లు వాళ్లుతెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన బోటు సిబ్బందిపై అధికారులు చర్యలు తీసుకోవాలని దంపతులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు బోటు సిబ్బంది నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు.

చదవండి: Umngot River In Meghalaya: ఇదేం వింత.. పడవ గాల్లో ఎగరడం ఏంటి..!?

మరిన్ని వార్తలు