అత్యాచార కేసులో సెషన్స్‌ కోర్టు కీలక తీర్పు.. ఆశారాం బాపునకు జీవిత ఖైదు

31 Jan, 2023 18:23 IST|Sakshi

అహ్మదాబాద్‌: దశాబ్దకాలం నాటి అత్యాచారం కేసులో వివాదాస్పద ఆధ్యాత్మిక వేత్త ఆశారాం బాపూ దోషిగా తేలిన విషయం తెలిసిందే. 2013లో తన ఆశ్రమంలో నివసిస్తున్న మహిళపై లైంగికదాడి కేసులో గాంధీనగర్‌ సెషన్స్‌ కోర్టు సోమవారం ఆయన్ను దోషిగా తేల్చింది. ఈ కేసులో తీర్పును రిజర్వు చేసిన న్యాయమూర్తి.. తాజాగా నేడు (జనవరి31) అతనికి జీవిత ఖైదు శిక్ష విధిస్తున్నట్లు వెల్లడించారు.

కాగా గుజరాత్‌ మోతేరాలోని ఆశారాం బాపూ ఆశ్రమంలో పనిచేస్తున్న సమయంలో 2001 నుంచి 2006 వరకు తనపై గురువు పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడినట్టు ఓ మహిళ 2013లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. సూరత్‌కు చెందిన మహిళ ఆశారాం బాపూతో సహా ఏడుగురిపై అత్యాచారం, అక్రమ నిర్బంధం కేసు పెట్టారు. దీంతో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

దీనిపై విచారణ జరిపిన గాంధీనగర్‌లోని సెషన్స్‌ కోర్టు ఈ కేసులో ఆశారాంను దోషిగా తేల్చింది. ఇదే కేసులో సరైన ఆధారాలు లేనందున ఆశారాం భార్య, కుమార్తె, కుమారుడితో పాటు మరో నలుగురు మహిళలను నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆశారాంకు జీవిత ఖైదు విధించింది.

కాగా 81 ఏళ్ల ఆశారం బాపూ ప్రస్తుతం మరో అత్యాచారం కేసులో జోధ్‌పూర్‌ జైలులో శిక్షననుభవిస్తున్నారు. జోధ్‌పూర్‌ ఆశ్రమంలో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారన్న ఆరోపణలపై ఆయనపై కేసు నమోదవ్వగా..2018లో జోధ్‌పూర్‌ ట్రయల్‌ కోర్టు దోషిగా తేల్చింది. అతడిని ఇండోర్‌లో అరెస్టు చేసిన పోలీసులు అనంతరం జోధ్‌పూర్‌కు తరలించారు. 2013 నుంచి జోధ్‌పూర్‌ జైలులోనే ఉన్నారు. ప్రముఖ అధ్యాత్మిక గురువుగా దేశ విదేశాల్లో శిష్యులను సంపాదించుకున్న ఆశారం చివరకు ఇలా కటకటాలపాలయ్యారు.
చదవండి: చైనా సంస్థ నుంచి డబ్బులు తీసుకొనే బీబీసీ తప్పుడు ప్రచారం'

మరిన్ని వార్తలు