రామభక్తుల నేలపై రావణుడు అనడం.. ఖర్గే కామెంట్లపై ప్రధాని ఘాటు కౌంటర్‌

1 Dec, 2022 15:17 IST|Sakshi

అహ్మదాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీలో గట్టి పోటీ ఒకటి నడుస్తోంది. ఆ పార్టీ నేతలు పోటీ పడి మరీ మోదీని తిడుతున్నారు. ఎవరైతే ఎక్కువగా, పెద్దగా, పదునైన అవమానాలకు మోదీ గురిచేస్తారో.. అంటూ పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. కానీ, అలాంటి పదాలు వాడుతూ.. వాళ్లు పశ్చాత్తాపం చెందకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది అని దేశ ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 

ఉత్తర గుజరాత్‌లోని పంచమహల్ జిల్లాలోని కలోల్‌లో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగిస్తూ.. కాంగ్రెస్‌ నేతల తీరుపై మండిపడ్డారు. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ ప్రెసిడెంట్‌ మల్లికార్జున ఖర్గే తనపై చేసిన రావణ్‌ కామెంట్‌పైనా ఆయన స్పందించారు. రామభక్తుల నేలపై ఒకరిని రావణుడు అని సంభోధించడం ఏమాత్రం సరికాదని మోదీ పేర్కొన్నారు. 

‘‘కొన్నిరోజుల కిందట ఓ కాంగ్రెస్‌ నేత.. మోదీకి కుక్క చావు తప్పదన్నాడు. మరో నేత హిట్లర్‌లా మోదీ చస్తాడని వ్యాఖ్యానించారు. ఇంకొకరేమో.. ఛాన్స్‌ దొరికితే మోదీని నేనే చంపేస్తా అంటాడు. ఒకరేమో రావణుడంటున్నారు. మరొకరు రాక్షసుడంటున్నారు. ఇంకొకరు బొద్దింక అంటున్నారు. ఇలా.. కాంగ్రెస్‌ పార్టీ నేతలు పదే పదే మోదీ పేరు వాడడం నాకు కొత్తేం అనిపించడం లేదు. కానీ, అలాంటి పదాలు వాడుతున్నప్పటికీ, కాంగ్రెస్‌కు ఎప్పుడూ పశ్చాత్తాపం చెందడం లేదని నేను ఆశ్చర్యపోతున్నా. అసలు వాళ్లు మోదీని అవమానించడం ఒక హక్కుగా అనుకుంటున్నారు అని మోదీ విమర్శలపై ఘాటుగా స్పందించారు. 

గుజరాత్ నాకు బలం ఇస్తే.. కాంగ్రెస్‌ను మాత్రం ఇబ్బంది పెట్టింది. ఓ కాంగ్రెస్ నాయకుడు ఇక్కడికి వచ్చి ఈ ఎన్నికల్లో మోదీ స్థాయి ఏంటో చూపిస్తాం అని సవాల్‌ విసిరాడు. అది సరిపోలేదని కాంగ్రెస్ అనుకుందేమో. అందుకే ఖర్గేను ఇక్కడికి పంపారు. ఆయన్ని(ఖర్గేని) నేను గౌరవిస్తా.. కానీ ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. గుజరాత్ రామభక్తుల నేల అని కాంగ్రెస్‌కు తెలియదు. అందుకే.. ఆయన ఇక్కడికి వచ్చి మోదీ వంద తలలున్న రావణుడన్నారు’’ అని మోదీ ఖర్గే విమర్శకు సమాధానం ఇచ్చారు. గుజరాత్‌లో ఇవాళ(గురువారం) ఫస్ట్‌ ఫేజ్‌ ఎన్నిక జరుగుతోంది. రెండో ఫేస్‌ ఎన్నిక డిసెంబర్‌ 5వ తేదీన(సోమవారం) జరగనుంది.

మరిన్ని వార్తలు