కూల్‌ డ్రింక్‌ తాగుతూ కంటపడ్డ ఎస్సై.. ‘బార్‌’కు వంద పంచాల్సిందేనంటూ కోకాకోలా రాథోడ్‌కు షాక్‌

18 Feb, 2022 14:44 IST|Sakshi

కోర్టు ప్రొసీడింగ్స్‌ అనేవి.. సినిమాల్లో చూపించినట్లు కాదు. చాలా సున్నితంగా.. హుందాగా ఉంటాయి. వాదనలు వింటూనే న్యాయమూర్తులు ప్రతీ విషయాన్ని గమనిస్తుంటారు కూడా. అయితే అది తెలియని ఓ ఎస్సై.. అడ్డంగా బుక్కై మూల్యం చెల్లించుకున్నాడు.
 
తాజాగా దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా ఎఫెక్ట్‌తో ప్రస్తుతం ఇంకా వర్చువల్‌ వాదనలే నడుస్తున్నాయి. ఈ క్రమంలో గుజరాత్‌ హైకోర్టులో ఓ పిటిషన్‌పై వాదనలు జరుగుతుండగా.. ఎస్సై ఏఎం రాథోడ్‌ కూల్‌గా కోకా కోలా టిన్‌ను కూల్‌గా సిప్‌ చేస్తూ ఉన్నారు. అది గమనించిన గుజరాత్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అరవింద్‌ కుమార్‌.. వెంటనే అదనపు గవర్నమెంట్‌ ప్లీడర్‌ డీఎం దేవ్‌నానితో ‘వీడియో కాన్ఫరెన్స్‌లో మిస్టర్‌ రాథోడ్‌ కూల్‌ డ్రింక్‌ తాగుతున్నారా ఏంటి?’ అని ప్రశ్నించారు. 

దీనికి ఏజీపీ వెంటనే క్షమాపణలు తెలియజేశాడు. అయినా సీజే శాంతించలేదు. ‘ఇదేం మీ ఆఫీస్‌ కాదంటూ..’ ఎస్సై రాథోడ్‌ను సున్నితంగా మందలించింది కోర్టు. అంతేకాదు కోకాకోలా తాగినందుకు శిక్షగా.. వంద కోకాకోలా టిన్‌లను బార్‌ అసోషియేషన్‌ సభ్యులకు పంచాలని సీజే అరవింద్‌ కుమార్‌, జస్టిస్‌ అశ్‌తోష్‌ శాస్త్రి నేతృత్వంలోని ధర్మాసనం ఆ ఎస్సైని ఆదేశించింది. లేకుంటే క్రమశిక్షణ ఉల్లంఘనల కింద శిక్ష తప్పదని హెచ్చరించింది.

‘‘మిస్టర్‌ కోకా కోలా రాథోడ్‌.. మీరొక్కరే తాగడానికి వీల్లేదు. సాయంత్రం కల్లా బార్‌ మెంబర్స్‌ అందరికీ కోకా కోలాను అందించండి’’ అంటూ ఆదేశించింది. దీంతో సదరు ఎస్సై మంగళవారం సాయంత్రమే ఆ ఆదేశాల్ని పాటించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఓ ట్రాఫిక్‌ జంక్షన్‌ వద్ద ఇద్దరు మహిళల్ని రాథోడ్‌, తోటి సిబ్బంది కలిసి చితకబాదారనే పిటిషన్‌ మీద వాదనల సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.  

గతంలో వర్చువల్‌ వాదనల సందర్భంగా ఓ అడ్వొకేట్‌ సమోసా తింటూ కనిపించగా.. ‘ఇలాంటివి చూసి ఇతరులకు కూడా తినాలని అనిపించదా? నోరురదా? ఇతరులకు ఇవ్వకుండా మీరొక్కరే తింటారా?’’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేస్తూ..అందరికీ సమోసాలు పంచాలంటూ సదరు న్యాయవాదిని ఆదేశించింది. తాజా ఘటన నేపథ్యంలో.. సమోసా ఘటనను మరోసారి గుర్తు చేశారు సీజే.

మరిన్ని వార్తలు