తెలివి ప్రదర్శిస్తున్నారా?.. మోర్బీ విషాదంపై కోర్టు సీరియస్‌, టెండర్లు లేకుండానే..

15 Nov, 2022 13:48 IST|Sakshi

అహ్మదాబాద్‌: గుజరాత్‌ మోర్బీ కేబుల్‌ బ్రిడ్జి దుర్ఘటనపై మంగళవారం సుమోటోగా విచారణ చేపట్టిన గుజరాత్‌ హైకోర్టు.. తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రమాద ఘటనపై నేరుగా తమకు కొన్ని సమాధానాలు కావాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే.. బ్రిడ్జి పునరుద్దరణ కాంట్రాక్ట్‌ను ఒవేరా కంపెనీకి కట్టబెట్టిన తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. 

మోర్బీ మున్సిపాలిటీ.. అజంతా బ్రాండ్‌ వాల్‌ క్లాక్‌లు తయారు చేసే ఒరేవా గ్రూప్‌నకు 15 ఏళ్లపాటు వేలాడే వంతెన కాంట్రాక్ట్‌ను కట్టబెట్టిన సంగతి తెలిసిందే. అయితే.. ‘‘పబ్లిక్ బ్రిడ్జి మరమ్మతు పనులకు టెండర్ ఎందుకు వేయలేదని, అసలెందుకు టెండర్లను ఆహ్వానించలేదు? అని ప్రధాన న్యాయమూర్తి అరవింద్‌ కుమార్‌, గుజరాత్‌ చీఫ్‌ సెక్రెటరీని ప్రశ్నించారు.

‘‘ప్రభుత్వ విభాగమైన మున్సిపాలిటీ(మోర్బీ మున్సిపాలిటీ).. తన బాధ్యతలను నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమైంది. ఫలితంగానే 135 మంది మరణించారు. అసలు ఈ ఒప్పందం.. 1963 గుజరాత్‌ మున్సిపాలిటీస్‌ చట్టానికి లోబడి ఇదంతా జరిగిందా?’’ అని గుజరాత్‌ హైకోర్టు ప్రాథమిక పరిశీలన ఆధారంగా వ్యాఖ్యానించింది. గుజరాత్‌ హైకోర్టు మోర్బీ కేబుల్‌ బ్రిడ్జి ప్రమాద ఘటనను సుమోటోగా స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు చీఫ్‌ జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌, జస్టిస్‌ అశ్‌తోష్‌ శాస్త్రి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ మేరకు ఆరు ప్రభుత్వ విభాగాల నుంచి వివరణ కోరింది ధర్మాసనం. అయితే.. 

మోర్బీ మున్సిపాలిటీ తరపు ప్రతినిధులెవరూ ఈ విచారణకు హాజరు కాలేదు. ఇక నోటీసులు అందుకున్నప్పటికీ రాకపోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది బెంచ్‌. తెలివి ప్రదర్శిస్తున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. వంతెన పునఃప్రారంభానికి ముందు దాని ఫిట్‌నెస్‌ని ధృవీకరించడానికి ఏదైనా షరతు ఒప్పందంలో భాగమేనా?,  అసలు ధృవీకరించడానికి బాధ్యత వహించే వ్యక్తి ఎవరు అనే దానిపై సమాధానాలతో తిరిగి రావాలని అధికారులను గట్టిగా మందలించింది.

అసలు అంత ముఖ్యమైన పనికి సంబంధించిన కీలకమైన ఒప్పందం.. కేవలం ఒకటిన్నర పేజీలతో ఎలా పూర్తి చేశారు? అని సీజే, సీఎస్‌ను నిలదీశారు. కాంట్రాక్ట్‌ పత్రాల ఫైల్స్‌ను తమకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.

ఇదీ చదవండి: బలవంతపు మతమార్పిళ్లు... దేశభద్రతకే పెనుసవాలు!

మరిన్ని వార్తలు