బీజేపీ సరికొత్త ప్రయోగం: విజయ్‌ రూపానీ మంత్రివర్గంలోని వారికి నో ఛాన్స్‌

17 Sep, 2021 07:44 IST|Sakshi

గాంధీనగర్‌: గుజరాత్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన భూపేంద్ర పటేల్‌ తన మంత్రివర్గాన్ని కూడా సిద్ధం చేశారు. గుజరాత్‌ కొత్త మంత్రులు గురువారం గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేశారు. మొత్తం 24 మంది మంత్రులతో కూడిన కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. వారందరితో గవర్నర్‌ ఆచార్య దేవ్‌వ్రత్‌ ప్రమాణం చేయించారు. ప్రమాణస్వీకారం అనంతరం ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ ఆధ్వర్యంలో తొలిసారి మంత్రివర్గం సమావేశం జరిగింది. అయితే ఈసారి అంతా కొత్తవారే మంత్రులుగా నియమితులు కావడం విశేషం.

గుజరాత్‌ మంత్రివర్గంతో సరికొత్త ప్రయోగం బీజేపీ చేపట్టింది. విజయ్‌ రూపానీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవారెవరికీ కూడా కొత్త మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు. 2022 ఎన్నికలకు భూపేంద్ర పటేల్‌ ఈ టీమ్‌తో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్నాడు. ముఖ్యమంత్రిగా ఉన్న విజయ్‌ రూపానీ రాజీనామాతో గుజరాత్‌లో కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్‌ ఎన్నికైన విషయం తెలిసిందే. 
చదవండి: రైలు పట్టాలపై మొసలి.. ఆగిపోయిన రైళ్లు


కొత్త మంత్రులు వీరే..

గజేంద్ర సిన్హ్‌‌ పర్మార్‌, రాఘవ్‌జీ మక్వానా, వినోద్‌ మొరాడియా, దేవభాయ్‌ మాలం, హర్ష్‌ సంఘ్వీ, ముఖేశ్‌ పటేల్‌, నిమిష సుతార్‌, అర్వింద్‌ రాజ్యాని, కుబేర్‌ దిన్‌దాన్‌, కీర్తిసిన్హ్‌ వాఘేలా, జగ్జీశ్‌ పంచాల్‌, బ్రిజేశ్‌ మెర్జా, జితూ చౌదరి, మనీశ వకీల్‌, కానూ భాయ్‌ దేశాయ్‌, కీర్తిసిన్హ్‌ రాణా, నరేశ్‌ పటేల్‌, ప్రదీప్‌సిన్హ్‌ పర్మార్‌, అర్జున్‌ సిన్హ్‌ చౌహాన్‌, రాజేంద్ర త్రివేది, జితూ వాఘానీ, రిషికేశ్‌ పటేల్‌, రాఘవ్జీ పటేల్‌, పూర్ణేశ్‌ మోదీ మంత్రులుగా ప్రమాణం చేశారు.

ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు గవర్నర్‌ ఆచార్య దేవ్‌వ్రత్‌, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ అభినందనలు తెలిపారు. కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు శుభాకాంక్షలు తెలిపి గుజరాత్‌ మార్క్‌ పాలనను కొనసాగించాలని ఆకాక్షించారు.
చదవండి: జాతీయ నిరుద్యోగ దినంగా ప్రధాని మోదీ జన్మదినం

మరిన్ని వార్తలు