గుజరాత్‌లో బీజేపీ ఘన విజయం

24 Feb, 2021 03:53 IST|Sakshi
గుజరాత్‌లోని సూరత్‌లో విజయోత్సవాలు జరుపుకుంటున్న బీజేపీ కార్యకర్తలు

స్థానిక ఎన్నికల్లో సత్తా చూపిన కమలం

అహ్మదాబాద్‌: గుజరాత్‌ స్థానిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఎన్నికలు జరిగిన ఆరు మున్సిపల్‌ కార్పొరేషన్లలోనూ అధికారం నిలుపుకుంది. అహ్మదాబాద్, రాజ్‌కోట్, సూరత్, జామ్‌నగర్, వడోదర, భావ్‌నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్లకు ఆదివారం ఎన్నికలు జరిగాయి.ఆరు కార్పొరేషన్లలో మొత్తం 576 డివిజన్లలో ఎన్నికలు జరిగాయి. వాటిలో 483 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. కాంగ్రెస్‌ 55 సీట్లు మాత్రమే గెలుపొందింది. తొలి సారి ఈ ఎన్నికల్లో పోటీ చేసిన ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) ప్రశంసనీయ స్థాయిలో ఫలితాలు సాధించింది.

సూరత్‌లో ఆ పార్టీ 27 స్థానాలు గెలుచుకుని, ఆ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. మొత్తం ఆరు కార్పొరేషన్లలో 470 స్థానాల్లో ఆప్‌ అభ్యర్థులను నిలిపింది. జామ్‌నగర్‌లో బహుజన్‌ సమాజ్‌ పార్టీ మూడు సీట్లలో విజయం సాధించింది. అహ్మదాబాద్‌లో 192, రాజ్‌కోట్‌లో 72, జామ్‌నగర్‌లో 64, భావ్‌నగర్‌లో 52, వదోదరలో 76, సూరత్‌లో 120 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. అహ్మదాబాద్‌లో 159, రాజ్‌కోట్‌లో 68, జామ్‌నగర్‌లో 50, భావ్‌ నగర్‌లో 44, వడోదరలో 69, సూరత్‌లో 93 సీట్లను బీజేపీ గెలుచుకుంది. అహ్మదాబాద్‌లో 25, రాజ్‌కోట్‌లో 4, జామ్‌నగర్‌లో 11, భావ్‌నగర్‌లో 8, వడోదరలో 7 సీట్లలో కాంగ్రెస్‌ గెలుపొందింది.  

ఈ విజయం ప్రత్యేకం
ఈ విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది చాలా ప్రత్యేక విజయమని ట్వీట్‌ చేశారు. రాష్ట్రంలో రెండు దశాబ్దాలకు పైగా అధికారంలో ఉన్న పార్టీ ఈ స్థాయిలో విజయం సాధించడం గొప్ప విషయమన్నారు. బీజేపీని విశ్వసించినందుకు రాష్ట్రప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ఇది ప్రజా విజయమని రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ పేర్కొన్నారు. ప్రధాని మోదీ అభివృద్ధి పథకాల ఫలితం ఇదని ట్వీట్‌ చేశారు. గుజరాత్‌లో ప్రభుత్వ వ్యతిరేకత ఎందుకు లేదన్న విషయంపై ఇక రాజకీయ విశ్లేషకులు అధ్యయనం ప్రారంభించవచ్చని వ్యాఖ్యానించారు. 

ఎంఐఎం విజయం: అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఏఐఎంఐఎం బోణీ కొట్టింది.  ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న జమల్‌పూర్, మక్తమ్‌పురా ప్రాంతాల్లోని 7 స్థానాల్లో గెలిచింది. 

మరిన్ని వార్తలు