గుజరాత్‌పై అర్బన్‌ నక్సల్స్‌ కన్ను: మోదీ

11 Oct, 2022 05:02 IST|Sakshi

బరూచ్‌(గుజరాత్‌): కొత్త రూపంలో అర్బన్‌ నక్సల్స్‌ తొలిసారిగా గుజరాత్‌లో అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. గుజరాత్‌ పర్యటనలో ఉన్న మోదీ బరూచ్‌ జిల్లాలో దేశంలోనే తొలి బల్క్‌ డ్రగ్‌ పార్క్‌కు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ‘ అర్బన్‌ నక్సల్‌ కన్ను గుజరాత్‌పై పడింది. శక్తియుక్తులున్న గుజరాతీ అమాయక ఆదివాసీ యువతను వారు లక్ష్యంగా చేసుకుందామనుకుంటున్నారు. అయితే వీరి ఆటలు ఇక్కడ సాగవు. వారిని రాష్ట్రం తరిమికొడుతుంది’ అని మోదీ అన్నారు.

ఆమ్‌ ఆద్మీ పార్టీ తొలిసారిగా గుజరాత్‌ ఎన్నికల బరిలో దిగుతున్న నేపథ్యంలో ఆప్‌నుద్దేశిస్తూ మోదీ ఈ పరోక్ష వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రాష్ట్రంలో నర్మదా నదిపై సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌ను మేథాపాట్కర్‌ వంటి వారు అడ్డుకోవడాన్ని అభివృద్ధి నిరోధక అర్బన్‌ నక్సలైట్లుగా గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌ అభివర్ణించారు. మేథా పాట్కర్‌ గతంలో ఆప్‌ టికెట్‌పై పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపాలయ్యారు. బరూచ్‌ ఫార్మా పార్క్‌ అందుబాటులోకి వచ్చాక బల్క్‌ డ్రగ్స్‌లో భారత్‌ స్వావలంబన సాధిస్తుందని మోదీ అన్నారు.

పటేల్‌ ఏకంచేశారు. కానీ నెహ్రూ..
గుజరాత్‌లోని ఆనంద్‌ జిల్లాలో సోమవారం ర్యాలీలో మోదీ మాట్లాడారు. ‘సర్దార్‌ పటేల్‌ సంస్థానాలన్నింటినీ దేశంలో విలీనం చేశారు. కానీ ఒక్క వ్యక్తి జమ్మూకశ్మీర్‌ అంశాన్ని నెత్తినేసుకుని ఎటూ తేల్చకుండా వదిలేశారు’ అని నెహ్రూపై విమర్శలు చేశారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న కశ్మీర్‌ సమస్యను పటేల్‌ స్ఫూర్తితో పరిష్కరించి ఆయనకు నివాళులర్పించానన్నారు.

మరిన్ని వార్తలు