పేపర్ లీక్ చేస్తే 10 ఏళ్ల జైలు శిక్ష.. రూ. కోటి జరిమానా!

24 Feb, 2023 09:19 IST|Sakshi

గాంధీనగర్‌: పోటీ పరీక్షల పేపర్ లీక్‌ ఘటనలను కట్టడి చేసేందుకు గుజరాత్ ప్రభుత్వం కఠిన చట్టాన్ని తీసుకొచ్చింది. ఎవరైనా, ఏ అధికార హోదాలో ఉన్నవారైనా సరే ఎగ్జామ్ పేపర్‌ లీక్ చేస్తే గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.కోటి వరకు జరిమానా విధించేలా కొత్త రూల్‌ తెచ్చింది. ఇందుకు సంబంధించిన బిల్లు 'ది గుజరాత్ పబ్లిక్ ఎగ్జామినేషన్‌(ప్రివెన్షన్‌ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్‌)- 2023'ను గుజరాత్ అసెంబ్లీ గురువారం ఆమోదించింది.  ఈ ఏడాది ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బిల్లు ఇదే కావడం గమనార్హం.

ఈ కొత్త రూల్‌ ప్రకారం పేపర్ లీక్ వ్యహారంతో సంబంధం ఉన్న వారు, దోషులను రెండేళ్ల పాటు ఎలాంటి పోటీ పరీక్షలు రాయకుండా నిషేధం విధిస్తారు. అలాగే ఏదైనా సంస్థ పేపర్ లీక్‌కు పాల్పడితే జీవితకాలం నిషేధిస్తారు. అవసరమైతే వారి అస్తులను విక్రయించి పరీక్ష ఖర్చులను వసూలు చేస్తారు. అయితే ఈ నిబంధనలు పోటీ పరీక్షలకు మాత్రమే వర్తిస్తాయి. 10, 12వ తరగతి, యూనివర్సిటీ పరీక్షలకు వర్తించవు.

పేపర్ లీక్ అయిన కారణంగా ఈ ఏడాది జనవరిలో పంచాయత్ జూనియర్ క్లర్క్‌ రిక్రూట్‌మెంట్ పరీక్షను గుజరాత్ ప్రభుత్వం రద్దు చేసింది. ప్రశ్నాపత్రాల ముద్రణకు ఇంఛార్జ్‌గా ఉన్న హైదరాబాద్‌ వాసి జీత్‌ నాయక్‌ సహా 15 మందిని నిందితులుగా గుర్తించింది. ఈ నేపథ్యంలోనే మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకొచ్చింది.
చదవండి: రణరంగంగా అమృత్‌సర్‌.. బారికేడ్లు తోసుకుని తల్వార్‌లతో పోలీస్‌ స్టేషన్‌కు!

మరిన్ని వార్తలు