12 ఏళ్లలో 339 చోరీలు.. పోలీసులకు ఏమాత్రం డౌట్‌ రాకుండా.. ఆ ఆలు మగలు ఎలా చిక్కారంటే!

27 Aug, 2022 12:26 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కాస్త రద్దీగా బస్సు కనిపిస్తే చాలు.. ఆ రెండు కార్లకు సడన్‌ బ్రేకులు పడతాయి. అందులో ఉన్న వాళ్ల ముఖాలు వెలిగిపోతాయి. బస్సులో మహిళల వైపు రష్ కనిపిస్తే.. ఆ ఇద్దరు ఆడవాళ్లలో ఒకరు దిగి తమ చేతివాటం ప్రదర్శించుకొస్తారు. అదే పురుషుల వైపు రద్దీ ఉంటే.. ఆ ఇద్దరు మగవాళ్లలో ఒకరు దిగి తమ పని కానిచ్చేస్తారు. ఏ మాత్రం సందేహం రాకుండా బస్సు దిగిపోయి.. తమ తమ కార్లలో గాయబ్‌ అవుతారు. 

ఇలా 12 ఏళ్లుగా 339 చోరీలకు పాల్పడ్డ రెండు జంటలను.. గుజరాత్‌ సోమనాథ్‌ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్‌ చేశారు. నిందితులు సంజయ్‌-గీత, నరేష్‌-రేఖలను కటకటాల వెనక్కి నెట్టారు. వాళ్ల నుంచి రెండు బ్రెజ్జా కార్లను, ఐఫోన్లను, లక్ష రూపాయల దాకా నగదు, నగలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. 

కూలీలు ఇలా.. 
దాహోడ్‌ జిల్లాకు చెందిన ఈ రెండు జంటలు కూలీ పనులు చేసుకుని జీవిస్తున్నారు. అయితే.. తేలికగా డబ్బు సంపాదించడం కోసం చేతులు కలిపి ఇలా చోరీలకు దిగారు. ఆ చోరీల ద్వారా వచ్చిన డబ్బుతోనే ఆరేసి లక్షల రూపాయల విలువ చేసే ఈ రెండు కాస్ట్‌లీ కార్లను కొనుగోలు చేశారు కూడా. కార్లలోనే తిరుగుతూ పోలీసులకు ఏమాత్రం అనుమానం రాకుండా దర్జాగా దొంగతనాలకు పాల్పడుతూ వచ్చారు. కానీ, స్థానికులకు ఏమాత్రం అనుమానం రాకుండా అప్పుడప్పుడు కూలీ పనులకు వెళ్తూ వస్తున్నారు. అయితే.. 

ఎలా పట్టారంటే.. 
ఆగస్టు 21, 22 తేదీల్లో వెరవల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రెండు చోరీ కేసులు నమోదు అయ్యాయి. ఈ రెండు కేసుల్లోనూ సోమనాథ్‌ మాంగ్రోల్‌ బస్‌ స్టేషన్‌ వద ఇద్దరు బాధితులు బస్సుల్లోనే.. నగదును పొగొట్టుకున్నారు. దీంతో సీసీ టీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు పోలీసులు. అందులో బ్రెజ్జా కారులో వచ్చిన ఇద్దరు మహిళలు.. లగేజీ లేకుండా రద్దీ బస్సులు ఎక్కడం, కాసేపటికే ఆ బస్సు దిగి తిరిగి కారులో వెళ్లిపోవడం పోలీసులకు అనుమానంగా అనిపించింది. దీంతో.. కారు నెంబర్‌ ఆధారంగా ట్రేస్‌ చేసి వెరవల్‌ దగ్గర వాళ్లను పట్టుకున్నారు. ఆపై భార్యలు ఇచ్చిన సమాచారంతో భర్తలనూ కూడా అరెస్ట్‌ చేశారు పోలీసులు. గత 12 ఏళ్లుగా గుజరాత్‌లో వివిధ ప్రాంతాల్లో ఇలా రద్దీ బస్సుల్లో చోరీలకు పాల్పడినట్లు ఈ రెండు జంటలు ఒప్పుకున్నాయి.

ఇదీ చదవండి: మిస్సింగ్‌ కాదు.. డబుల్‌ మర్డర్‌! 

మరిన్ని వార్తలు